భారత్ సమాచార్. నెట్, న్యూఢిల్లీ: సీపీఎం నూతన కార్యదర్శిగా కేరళ మాజీ మంత్రి ఎంఏ బేబీ ఎన్నికయ్యారు. తమిళనాడులోని మధురైలో ముగిసిన సీపీఎం 24వ మహాసభల్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగానే ఎం.ఏ. బేబీని పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సీతారాం ఏచూరి మృతి చెందడంతో ఖాళీ అయిన పదవిని ఎంఏ బేబీ భర్తీ చేయనున్నారు. అంతేకాకుండా, 85 మంది సభ్యులతో కేంద్ర కమిటీని పార్టీ ఎన్నుకుంది. కొత్తగా 18 మంది సభ్యులతో పొలిట్ బ్యూరో ఏర్పాటైంది. కేంద్ర కమిటీలో సుమారు 20 శాతం మంది మహిళలు ఉన్నారు. అందులో 8 మంది కొత్తవారు కావడం గమనార్హం. కాగా, ప్రకాశ్ కరత్, బృందా కరత్, మాణిక్ సర్కార్, సుభాషిణి అలీలు పొలిట్ బ్యూరో నుంచి వైదొలిగారు. కొత్త పొలిట్ బ్యూరోలో పినరయి విజయన్, బీవీ రాఘవులు, తపన్ సేన్, ఎండీ సలీం, విజూ కృష్ణన్ తదితరులు ఉన్నారు. మరోవైపు, గతేడాది సీతారాం ఏచూరి మృతి చెందినప్పట్నుంచి ప్రధాన కార్యదర్శి పదవి ఖాళీగానే ఉంది. అప్పట్నుంచి పార్టీ తాత్కాలిక సమన్వయకర్తగా సీనియర్ నేత ప్రకాశ్ కారాట్ వ్యవహరిస్తున్నారు. కాగా.. ఇప్పుడు ఎంఏ బేబీ సీఎం పార్టీ బాధ్యతలు తీసుకున్నారు.
ఎంఏ బేబీ రాజకీయ ప్రస్థానం
కేరళ రాష్ట్రంలోని ప్రాక్కుళంలో 1954లో జన్మించిన ఎంఏ బేబీ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కెరళ స్టూడెంట్స్ ఫెడరేషన్‌తో ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. ఎస్‌ఎఫ్‌ఐ మరియు డీవైఎఫ్‌ఐ వంటి యువజన సంఘాల్లో పనిచేశారు. 1986 నుంచి 1998 వరకు రాజ్యసభ సభ్యుడిగా సేవలందించిన ఆయన.. 2006 నుంచి 2016 వరకూ కుందర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. అలాగే, 2006-2011 మధ్య కాలంలో కేరళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. 2012లో సీపీఎం పొలిట్ బ్యూరోలో చేరి అప్పటినుంచి కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయనకు భార్య బెట్టీ లూయిస్, కుమారుడు అశోక్ బెట్టీ నెల్సన్ ఉన్నారు.