భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Cm Revanth Reddy)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఎక్కడైనా వందశాతం రుణమాఫీ ( Rythu Runamafi) జరిగినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. గురువారం ఆయన అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాల్లో మాట్లాడుతూ.. ఏ నియోజకవర్గానికైనా వెళ్దామని.. ఏ ఒక్క నియోజకవర్గంలోనైనా రుణమాఫీ వందశాతం అయినట్లు నిరూపిస్తే.. అక్కడే క్షణం ఆలోచించకుండా రాజీనామా చేస్తా అని స్పష్టం చేశారు. అంతేకాదు.. శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని వ్యాఖ్యనించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి కుంటుపడిందని.. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, విద్యార్థులు ఎవరూ సంతోషంగా లేరన్నారు. రేవంత్ సర్కార్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఆరు గ్యారెంటీలకు, ఉద్యోగులకు డీఏ, తులం బంగారానికి పైసల్లేవు.. కానీ ఫ్యూచర్ సిటీ, మూసీ అభివృద్ధి ఇతరత్రా వాటికి పైసలు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు. తమ పాలనలో తెలంగాణ అతి తక్కువ సమయంలోనే ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. సంక్షేమంలో మానవీయ కోణాన్ని, అభివృద్ధిలో ప్రణాళికాబద్ధమైన దృక్పథాన్ని కలిపి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపారని తెలిపారు.
అలాగే ప్రతిదానికి ప్రభుత్వం రాష్ట్రం అప్పుల పాలైందనడం సరికాదని అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైంది అనడానికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. గత పదేళ్ళలో ఏమీ చేయకుండానే రాష్ట్రంలో సంపద పెరిగిందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినపుడు సగటు ఆదాయం రూ. 3500 కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.18 వేల కోట్లు ఉందన్నారు. అప్పులకు రెట్టింపు సంపద పెరిగిందని తెలిపారు. అమెరికా లాంటి దేశాలకు కూడా అప్పులు ఉంటాయని, అప్పులు లేని దేశం గాని రాష్ట్రం గాని ఉండవన్నారు. అమాటకొస్తే అప్పులు లేని మనిషి కూడా ఉండడని.. ఈ సభలో ఉన్నవారికి కూడా అప్పులు ఉన్నాయన్నారు.