భారత్ సమాచార్, భైంసా ;
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ రోజుల్లోకి రావటంతో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో స్పీడ్ తో పాటుగా విమర్శల తీవ్రతను కూడా భారీ స్థాయిలో పెంచారు. తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని భైంసాలో జరిగిన రోడ్ షో లో పాల్గొని ప్రసంగించారు.
బీజేపీ వాళ్లు ఏమైనా అంటే నమో అంటారు. నమో అంటే నరేంద్రమోడీ కాదు నమ్మించి మోసం చేసే వ్యక్తని అన్నారు. పదేళ్లలో దేశానికి గాని, ఆదిలాబాద్ కు గానీ ప్రధాని ఒక్క మంచి పని కూడా చేయలేదన్నారు. బీజేపీ ఎంపీ ముధోల్ తాలుకాలో ఒక్కటంటే ఒక్క పని చేయలేదని ఆరోపించారు. 2014 మోడీ చాలా హామీలిచ్చిండన్నారు. రూ. 15 లక్షలు అందరి అకౌంట్లో వేస్తానని, రైతుల ఆదాయం డబుల్ చేస్తామని, అందరికీ ఇళ్లు ఇస్తామని, ఇంటింటికి నల్లా అని చాలా, చాలా చెప్పారని కానీ కానీ చెప్పిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. పదేళ్లలో చేసిన పని ఏందయ్యా అంటే మేము గుడి కట్టినం అంటారు. మరి కేసీఆర్ వెయ్యేళ్లు నిలిచిపోయేలా యాదాద్రి గుడిని కట్టలేదా ? అని ప్రశ్నించారు. ఒక్క యాదాద్రి గుడి మాత్రమే కాదు…ఆధునిక దేవాలయాలైన సాగునీటి ప్రాజెక్ట్ లు కూడా కట్టించారని ప్రజలకు గుర్తుచేశారు. పదేళ్లు ప్రధానిగా పని చేసిన మోడీ ఒక్క బడి కట్టలే, గుడి కట్టలే, కొత్త కాలేజ్ ఇవ్వలే, ఓ ప్రాజెక్ట్ కట్టలేదని ఆరోపించార . చేసిన పనులు చెప్పుకునే పరిస్థితిలో బీజేపీకీ లేదని, అందుకే దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారన్నారు. ఏమన్న అంటే జై శ్రీరాం అంటారు అంతేనన్నారు. శ్రీరాముడు అందరి వాడు. దేవుళ్లు బీజేపీ పార్టీకి చెందిన వాళ్లు కాదన్నారు. రాముడు మర్యాద పురుషుడు. రాజధర్మం పాటించాలని చెప్పారు. మోడీ మాత్రం గుజరాత్ కు వేల కోట్లు ఇచ్చి, తెలంగాణ కు బుడ్డ పైసా కూడా ఇవ్వలేదన్నారు. దేవుడి పేరు చెప్పి అదానీకి, అంబానీకి దోచిపెట్టే సన్నాసులకు బుద్ధి చెప్పాలన్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో 5 నెలల కింద కేసీఆర్ ఇక్కడికి వచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ను నమ్మి మోసపోవద్దని అప్పుడు కేసీఆర్ చెప్పారన్నారు. ఐదు నెలల్లో కాంగ్రెస్ పాలన ఎట్ల ఉందో చూశారు కదా? కరెంట్ కోతలు ఎట్లున్నాయని అడిగారు. రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు రూ. 2500, పెద్దమనుషులకు రూ. 4 వేలు, తులం బంగారం, స్కూటీలు ఇలా కుప్పలు, తెప్పలుగా హామీలు గుప్పించారన్నారు. రేవంత్ రెడ్డి చెప్పిన హామీల్లో ఒక్క హామీ అన్న అమలైందా? అని ప్రజలను అడిగారు. ఇంకా కాంగ్రెస్ ను నమ్మకూడదు, వాళ్లకు ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు.
ఆత్రం సక్కు సీనియర్ నాయకులు. ఆదివాసీల కోసం ఎంతో కృషి చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడే తెలంగాణ బాగుండే అని అనుకునేటోళ్లకు ఒక ఉపాయం చెబుతా వినండన్నారు. మీరు ఈ నెల 13వ తారీఖు నాడు సక్కు ని కారు గుర్తు పై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ మనం సరైన వ్యక్తులకు అవకాశం ఇవ్వలేకపోయామన్నారు. మన పార్టీ నుంచి వెళ్లిపోయిన వాళ్లు పోనివ్వడి. చెత్తంతా పోతోందని తెలిపారు.