Homemain slidesప్రియమైన కాదు...పిరమైన ప్రధాని

ప్రియమైన కాదు…పిరమైన ప్రధాని

భారత్ సమాచార్, మల్కాజ్ గిరి ;

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అన్ని రాజకీయ పార్టీల ప్రధాన నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారు. కొన్ని చోట్ల బ్యాలెట్ ఓటింగ్ కూడా మొదలయిపోయింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలోని కర్మన్ ఘాట్ లో జరిగిన రోడ్ షో లో పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపైన విమర్శలు గుప్పించారు.

ప్రజలు పిరమైన ప్రధాని అని అంటున్నారు…

ఏమయ్యా మోడీ దేశానికి, హైదరాబాద్ కు ఏం చేసినవ్ అంటే చెప్పటానికి ఏమీ లేదంటారు. హైదరాబాద్ కు వరదలు వస్తే ఒక్క పైసా ఇయ్యలేదని ఆరోపించారు. గుజరాత్ కు వరదలు వస్తే వెయ్యి కోట్లు ఇచ్చిండని విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్టానికి మాత్రం రూపాయ్ ఇవ్వలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఐటీఐఆర్ ను రద్దు చేశాడన్నారు. మనకు చేయూత ఇవ్వమంటే ఉన్నది కూడా గుంజుకున్నాడన్నారు. బీజేపీకి ఓటు ఎందుకు వేయాలంటే మేము గుడికట్టిన ఓటు వేయాలే అంటున్నారు. గుడి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణమైతే కేసీఆర్ యాదాద్రి కట్టారని ప్రజలకు గుర్తు చేశారు. దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామా? కేసీఆర్ కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం కట్టాడన్నారు.రిజర్వాయర్లు, చెరువులను పూర్తి చేశాడన్నారు. వాటికి కూడా దేవుళ్ల పేర్లు పెట్టారని తెలిపారు. పప్పు, ఉప్పు చింతపండు ధరలు పెరిగినయ్. అందుకే ప్రధానిని ప్రియమైన ప్రధాని కాదు, పిరమైన ప్రధాని అంటున్నారన్నారు. ప్రజల ముక్కు పిండి రాష్ట్రాలకు వాటా దక్కకుండా సెస్ వేసి రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండని ఆరోపించారు. ఏం చేసినవయ్యా ఆ పైసలు అంటే జాతీయ రహదారులు కట్టినా అంటాడు. మరి టోల్ ఎందుకు ఎందుకు వసూల్ చేసివంటే చెప్పడన్నారు.

అలవి కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు...

గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్ కు 16 సీట్లు వచ్చాయి, కానీ జిల్లాలోని ప్రజలు కాంగ్రెస్ మోసపూరిత హామీలు నమ్మి మోసపోయారన్నారు. వృద్ధులకు రూ. 4 వేలు, రైతు భరోసా, తులం బంగారం అంటూ అలవి కానీ హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉన్నామన్నారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి నాలుగు నెలల్లో ఒక్కటంటే ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదని విమర్శించారు. తెలంగాణకు వచ్చి
రాహుల్ గాంధీ కూడా పచ్చి అబద్దాలు చెప్పాడన్నారు. నిర్మల్ సభలో రాహుల్ గాంధీ ప్రతి మహిళకు రూ. 2500 వచ్చినయ్ అని చెప్పారు, నాకు నవ్వాలో…ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు ఏమీ చెప్పినా నమ్ముతారన్నట్లు మిమ్మల్ని తక్కువ అంచనా వేసి కాంగ్రెస్ వాళ్లు అబద్దాలు చెబుతున్నారన్నారు. రాహుల్ గాంధీ గారు అమాయకుడని, వాళ్లు రాసిచ్చింది చదువుతాడన్నారు. కానీ, మీ రేవంత్ రెడ్డి ఈ ఎన్నికల తర్వాత మీతో ఉంటాడో లేదో చూసుకోవాలన్నారు.

రాహుల్ గాంధీ ఎడ్డం అంటే రేవంత్ తెడ్డం అంటారు…

రాహుల్ గాంధీ చౌకిదార్ చోర్ అంటారు. రేవంత్ రెడ్డి మాత్రం మోడీ బడే భాయ్ అని అంటారు. రాహుల్ గాంధీ అదానీ ఫ్రాడ్ అని అంటే, రేవంత్ రెడ్డి మాత్రం అదానీ మేరా ఫ్రెండ్ అంటారు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ అంటే, రేవంత్ రెడ్డి మాత్రం గుజరాత్ మోడల్ తెస్తా అని అంటారు. రాహుల్ గాంధీ లిక్కర్ స్కాం లేదు కేజ్రీవాల్ అరెస్ట్ తప్పు అంటే, రేవంత్ రెడ్డి మాత్రం కవితమ్మను అరెస్ట్ చేసుడు కరెక్టే అని అన్నారన్నారు. బీఆర్ఎస్ తరపున రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

మరికొన్ని రాజకీయ సంగతులు…

ఆంధ్రాకి మట్టి, తెలంగాణ కు గాడిద గుడ్డు…

RELATED ARTICLES

Most Popular

Recent Comments