భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: సికింద్రాబాద్ లష్కర్ బోనాలకు సర్వం సిద్ధమైంది. అమ్మవారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలను ప్రత్యేకంగా అలకరించారు. అమ్మవారి నామస్మరణ, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల పూనకాలతో నేడు సికింద్రాబాద్ మారుమోగనుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నేడు ఉజ్జయినీ మహంకాళి బోనాలు ఘనంగా నిర్వహించనున్నారు.
ఆదివారం తెల్లవారుజామున వేద మంత్రోచ్చారణలతో ఆలయ ద్వారం తెరిచారు. ప్రత్యేక పూజల అనంతరం బోనాలు సమర్పించేందుకు భక్తులకు అనుమతించనున్నారు. నగరం నలుమూలల నుంచి భక్తులు తరలి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. సాయంత్రం ఫలహారం బండ్ల ఊరేగింపు జరగనుంది. దీని కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.
దద్దరిల్లనున్న హైదరాబాద్:
భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. వీఐపీల తాకిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉండనుండటంతో.. పకడ్భందీగా ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో బోనాల సమర్పణ నుంచి పలహారం బండ్ల ఊరేగింపు, మరుసటి రోజు జరిగే రంగం – భవిష్యవాణి కార్యక్రమాల వరకు అన్నీ సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచే కాదు విదేశాల నుంచి సైతం అమ్మవారి దర్శనం కోసం తరలివస్తున్నారు భక్తులు.
కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు:
బోనాల సందర్భంగా దాదాపు 15 వందల మంది పోలీసులతో కట్టదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. మరోవైపు బోనాల సందర్భంగా 175 ప్రత్యేక బస్సులు నడపనుంది తెలంగాణ ఆర్టీసీ. లష్కర్ బోనాల సందర్భంగా రెండు రోజులపాటు అమ్మవారి ఆలయం పరిసరా ప్రాంతాల్లోని అన్ని ప్రధాన రహదారుల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. అమ్మవారిని దర్శించుకునే భక్తులకు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పలు మార్గాల్లో రెండు రోజులపాటు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు హైదరాబాద్ నగర కమిషనర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. జాతర ముగిసేవరకు ఆంక్షలు కొనసాగుతాయన్నారు. ట్రాఫిక్ దృష్ట్యా రేపు రైల్వేస్టేషన్‌కు వెళ్లాలనుకునే వారు ముందుగానే ఇంట్లోంచి బయలుదేరితే మంచిదని సూచించారు.
మరిన్ని కథనాలు: