భారత్ సమాచార్.నెట్, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని దామోహ్ జిల్లాలో నకిలీ డాక్టర్ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. యూకే రిటర్న్ అని కార్డియాలజీ స్పెషలిస్టు అని ప్రైవేటు హాస్పిటల్ లో చేరిన వ్యక్తి ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాడు. దామోహ్ జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి హార్ట్ సర్జరీలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రిటన్ కు చెందిన ఫేమస్ డాక్టర్ ‘ఎన్. జాన్ కెన్’ అనే పేరుతో నకిలీ సర్టిఫికెట్లు చూపించి ఆ ఆస్పత్రి యాజమాన్యాన్ని మోసం చేశాడు ఏ ప్రబుద్ధుడు. అయితే, అదే నిజం అనుకుని.. ఆస్పత్రి యాజమాన్యం కార్డియాలజీ డిపార్ట్ మెంట్ ని అప్పగించింది. అతనితో గుండె సంబంధిత ప్రధాన ఆపరేషన్లు చేయించింది. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ప్రభుత్వం అందించే నిధులు కూడా స్వాహా చేశాడు. అయితే, అతడు మొత్తం 15 ఆపరేషన్లు చేయగా.. వారిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఈ ఘటనపై స్థానిక చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ దీపక్ తివారీ దృష్టి సారించి విచారణ చేపట్టగా అసలు విషయంలో వెలుగులోకి వచ్చింది. ఏడుగురు చనిపోవడంతో దామోహ్ జిల్లా కలెక్టర్ ని దీపక్ తివారీ సంప్రదించారు. దీంతో, కలెక్టర్ దర్యాప్తునకు ఆదేశించారు. అయితే, విచారణలో భాగంగా నకిలీ డాక్యుమెంట్లతో డాక్టర్‌గా వ్యవహరిస్తున్న వ్యక్తి భాగోతం బయటపడింది.నిందితుడి పేరుని నరేంద్ర విక్రమాదిత్య యాదవ్ అని గుర్తించారు.ప్రముఖ బ్రిటీష్ వైద్యుడు ఎన్ జాన్ కెమ్ పేరుతో అతడు నకిలీ పత్రాలు సమర్పించినట్లు తెలుసుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం (NHRC) తీవ్రంగా స్పందించింది. ఏడుగురు ప్రాణాలు పోవడం బాధాకరమని పేర్కొంటూ, ఫేక్ డాక్టర్ పై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్ నిధులను అక్రమంగా వాడిన కోణంలోనూ విచారణ జరుగుతోందని ప్రియాంక్ కనూంగో తెలిపారు.మృతులు ఇంకా ఎక్కువ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.