భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: “మన్ కీ బాత్” (Mann Ki Baat) కార్యక్రమం 120వ ఎపిసోడ్ (120 Episode) అంటే ఈరోజు (మార్చి 30 2025) ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఆకాశవాణి (Akashvani), దూరదర్శన్ (Doordarshan)లో ప్రత్యక్షంగా ప్రసారమైంది. ఈ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ దేశ ప్రజలతో తన మనసులోని భావాలను పంచుకున్నారు. ఈ రోజు కార్యక్రమంలో కొన్ని కీలక అంశాలపై దృష్టి సారించారు, ముఖ్యంగా సాంస్కృతిక వైవిధ్యం, పండుగలు, ఆరోగ్యం, యువత పాత్ర గురించి ప్రధాని మోదీ(PM Modi) మాట్లాడారు.
మోదీ తన ప్రసంగంలో ఏప్రిల్ నెలలో వచ్చే నవరాత్రి, ఈద్ వంటి పండుగల గురించి ప్రస్తావించి, దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. “పూర్తి నెల అంతా పండుగలు, పర్వాలతో నిండి ఉంటుంది” అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ (AP), తెలంగాణ (Telangana) రాష్ట్రాల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలుగు ప్రజలకు ఉగాది పండుగ (Ugadi Wishes)శుభాకాంక్షలను తెలిపిన ప్రధాని.. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అరకు కాఫీ (Araku coffee)ని ప్రధాని మరోసారి ప్రశంసించారు. “అరకు కాఫీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది, ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల కష్టానికి నిదర్శనం” అని ఆయన అన్నారు. అలాగే ఆదిలాబాద్ ఆదివాసీ మహిళలు తయారు చేసే ఇప్పపువ్వు లడ్డూల గురించి కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పపువ్వు లడ్డూ (Ippa Puvu Laddu)ల ద్వారా స్వయం ఉపాధి పొందుతూ ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈ ఆదివాసీ మహిళల స్వయం కృషిని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని అభినందించారు.
2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ ప్రజలతో తన మనసులోని భావాలను తెలిపేందుకు ఈ వినూత్న కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. 2014 అక్టోబర్ 3న విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని మొదటిగా ప్రారంభించారు. అప్పటి నుండి తన మనసులోని మాటలను మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేస్తున్నారు.