భారత్ సమాచార్, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ దూకుడు పెంచింది. ఈసారి మళ్లీ కేంద్రంలో అధికారంలోకి రావాలన్న దృఢ సంకల్పంతో ఉన్న బిజెపి తెలంగాణ రాష్ట్రంపై ప్రధానంగా ఫోకస్ చేస్తుంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ రేపు హైదరాబాద్ కు రానున్నారు. రేపటి నుండి మూడు రోజులపాటు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మల్కాజ్ గిరిలో రోడ్ షో నిర్వహించనున్నారు. మీర్జాలగూడా నుంచి మల్కాజ్గిరి వరకు ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహించటానికి బిజెపి నేతలు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు. మల్కాజ్గిరి లోక్ సభ పరిధిలో 1.3 కిలోమీటర్ల మేర ప్రధాన మంత్రి రోడ్ షో జరగనుంది.
హ్యాట్రిక్ కోసం మోడీ మేనియా:
మార్చి 16వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ నాగర్ కర్నూల్ పట్టణంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే మార్చి 18వ తేదీన జగిత్యాలలో జరుగుతున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో రెండు చోట్ల కూడా ప్రధాని మోడీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేయడానికి బీజేపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను సక్సెస్ చేయడానికి, మోడీ మేనియా మరోమారు దేశంలో ఉందని ప్రూవ్ చేయడానికి తెలంగాణ బిజెపి శ్రేణులు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ, పార్టీ శ్రేణులలో, కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.