భారత్ సమాచార్.నెట్, అమరావతి: ప్రధాని మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)కు రానున్నారు. మే 2న ఏపీ రాజధాని అమరావతి (Amaravati)లో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి పునర్నిర్మాణం (Amaravati Capital Relaunch) పనులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టనున్నారు.అయితే గతంలో అమరావతి శంకుస్థాపనకు హాజరైన ప్రధాని మోదీ ఇప్పుడు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి కూడా హాజరుకానున్నారు.కాగా ప్రధాని మోదీ అమరావతి పర్యటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) క్లారిటీ ఇచ్చారు.
ప్రధాని మోదీ పర్యటన నిర్ధారణ కావడంతో సీఎం కార్యాలయం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పర్యటనపై మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించి, ప్రధాని పర్యటన విజయవంతంగా చేసేందుకు భారీ ఏర్పాట్లు చేయాలని మంత్రులు, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని సభను అమరావతి సచివాలయం వెనుక భాగంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.అక్కడే భారీ స్థాయిలో వేదిక నిర్మాణం జరుగుతుంది. కనీసం లక్ష మంది ప్రజలు పాల్గొనే ఈ సభకు ప్రత్యేకంగా బస్సులు, పార్కింగ్ సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు అమరావతి పర్యటనలో ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి పునర్నిర్మాణంపై పూర్తి దృష్టి సారించింది.ఇప్పటికే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన అనుమతులను సీఆర్డీఏ అథారిటీతో పాటు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదం తెలపింది. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, ప్రధాన రహదారుల నిర్మాణాన్ని వచ్చే మూడేళ్లలో పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.