భారత్ సమాచార్, హైదరాబాద్ ;
పెళ్ళైనప్పటి నుండి తన భార్య మానసికంగా , శారీరకంగా హింసిస్తుందని బాధితుడు స్థానిక ఆల్వాల్ పోలీస్ స్టేషన్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. భార్య నుంచి తన తల్లిదండ్రులకు కూడా ప్రాణహాని ఉందని మీడియా ముందు వాపోయారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకున్న ఘటన తాజాగా భాగ్యనగరంలో చోటుచేసుకుంది. ఒంటిపై భార్య చేసిన గాయాలను చూపిస్తూ , మీడియాతో తన గోడును చెప్పుకున్నారు బాధితుడు. ఏపీ రాజోలుకు చెందిన టెమూజియన్ కు అమలాపురంకు చెందిన లక్ష్మీ గౌతమితో ఏడేళ్ల క్రితం పెళ్లి జరగగా, ప్రస్తుతం ఆయన మల్లారెడ్డి కాలేజీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాడు.
ఈ విషయంపై పలుమార్లు పెద్దవాళ్ళ సమక్షంలో మాట్లాడినా ఆమె తీరు మారలేదన్నారు. ఇటీవల తనను చంపేందుకు కత్తితో దాడి చేసినట్లు తెలిపారు. ఈ విషయంపై స్థానిక అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, అయితే పోలీసులు కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. మహిళలకు ఒక చట్టం , పురుషులకు ఒక చట్టం ఉంటుందా అని నిలదీశారు. తాను నిన్నటి నుంచి ఇంటికి కూడా వెళ్లలేదని , వెళ్తే తన భార్య మళ్ళీ దాడి చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు తన భార్యపై కేసు నమోదు చేసి , తనకు వెంటనే రక్షణ కల్పించాలని బాధిత భర్త మీడియా సమక్షంలో వేడుకున్నారు.