భారత్ సమాచార్, అక్షర ప్రపంచం ;
చరిత్ర లోతుల్లో అనాది ఆచారాలు, సంస్కృతి పేరుతో మహిళలను బానిసలుగా మార్చి వారిపై చేసిన అఘూయిత్యాలు ఎన్నో. ప్రాణానికి ఎదురొడ్డి మూడ నమ్మకాలతో పోరాడిన వీర వనితలు ఎందరో. వీరనారులు ఝాన్సీ లక్ష్మి బాబు, రాణి రుద్రమదేవి, గిరిజన వీరనారి సమ్మక్క – సారలమ్మల త్యాగం అజరామరం. అలానే మహిళలకు దారుణమైన శిక్షలు వేస్తూ వెట్టిచాకిరీ చేయిస్తూ.. మానభంగాలకు గురిచేస్తూ పాలించే దుర్మార్గపు పాలకులను అంతం చేయడానికి పుట్టిన వీర నారే ‘నంగేళి’. చావలేక బ్రతుకలేక చిత్రవధ అనుభవిస్తున్న సమాజాన్ని ఉద్ధరించిన ధీర వనిత నంగేళి. ఈమె త్యాగం, ఆమె నిర్ణయం గుండెల్లో నిప్పు రగిలేలా చేస్తుంది. కేరళలో జరిగిన ఉద్యమం.. దేశమే ఉలిక్కిపడేలా చేసింది. రాజులు పాలన.. ఎన్నో దారుణాలకు నిలయం. వారు విధించే పన్నులు కట్టలేక కూలీలుగా, బానిసలుగా జీవనం సాగించేవారు. పేదలు, నిమ్న కులాలు, గిరిజనులు సంపన్నులు కావడం అగ్రవర్ణాలకు ఇష్టం ఉండేది కాదు. పేదవాళ్ళు ధనికులుగా ఎదిగితే తమ మాట వినరని, బానిసలుగా ఉండరని భావించి పేదల రక్తాన్ని దోపిడీ చేసేవారు. కేరళలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇవే. అప్పట్లో అక్కడి సమాజంలో కులగజ్జి జీవితాల్ని చిదిమేసేది. ముఖ్యంగా ట్రావెన్కో సంస్థాన పాలనలో దారుణమైన పన్ను విధానం ఉండేది. దారుణమైన అకృత్యాలు చేస్తూ అనేక పన్నులు విధించేవారు. ఇందులో అతి క్రూరమైంది ‘రొమ్ము పరిమాణ పన్ను’.
కేరళలోని ట్రావెన్కో సంస్థానంలో మహిళ రొమ్ము పరిమాణాలను చూసి పన్ను విధించేవారు. అంటే, మహిళల రొమ్ములు ఎంత పెద్దగా ఉంటే అంత పన్ను చెల్లించాలి. అంతేకాదు.. మహిళల తమ రొమ్ములను వస్త్రంతో కప్పకూడదు. కేవలం అగ్రకులాల వారు, ధనిక కులాలకు చెందిన మహిళలు మాత్రమే రొమ్ములను వస్త్రాలతో కప్పుకొనే హక్కు ఉండేది. గిరిజనులు, ఇతరత్ర నిమ్న కులాల మహిళలపై వస్త్రం లేకుండా బయట తిరగాలి. ఈ విధానంతో అక్కడి మహిళలు రోధించిన తీరు ఉహించలేనిది. దిక్కుతోచని పరిస్థితిలో చేసేది ఏం లేక రొమ్ములపై వస్త్రాలు లేకుండానే వీధుల్లో తిరిగేవారు. అంతేకాదు అధికారులు వచ్చినప్పుడల్లా వారికి చూపించాలి. దీన్ని ఆసరగా తీసుకుని సైనికులు, అధికారులు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడేవారు. అధికారులు నెలకోసారి ప్రజల ఇళ్లకు వచ్చి మహిళల రొమ్ముల పరిమాణం, బరువును కొలిచి, పన్నులు విధించేవారు. ఈ పన్ను విధానాన్ని ‘ముళక్కరం’ అనేవారు. ఎదిరిస్తే మహిళలను భర్త ఎదుటే అధికారులు అత్యాచారాలు చేసేవారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న మహిళలు ఎందరో. కొందరు అధికారులు పన్ను మినహాయింపు పేరుతో మహిళలను లోబరుచుకొని లైంగిక వాంఛ తీర్చుకునేవారు. వారిని ఎదిరించలేక గిరిజన ప్రజలు బిక్కుబిక్కుమంటూ బ్రతికేవారు. ఈ అరాచకాన్ని తట్టుకోలేక పోయింది నంగేలీ. అన్యాయాన్ని, తమపై జరుగుతున్న అకృత్యాలను ఎదురించింది.
రాజుల ఆంక్షలను వ్యతిరేకించి, అధికారుల తీరుపై ఎదురుతిరిగి ఆడవారికి సహజంగా పెరిగే రొమ్ములపై పన్నులు వేయడం ఏమిటని నిలదీసేది. అగ్రకులాల స్త్రీల వలె తాము ఎందుకు వస్త్రాలను ధరించకూడదని ఎదురుతిరిగింది. తాను అర్థనగ్నంగా తిరగనంటూ తన రొమ్ములను కప్పి ఉంచేది. అధికారులు పన్ను కోసం ఇంటికి వస్తే.. తన రొమ్ములను చూపించనని మొండికేసేది. నంగేళి పోరాట పటిమకు ఆమె భర్త మద్దతు తెలపడంతో ఆమె ధైర్యంగా పన్ను విధానాన్ని ఎదుర్కోగలిగింది. నంగేళిని ఆదర్శంగా తీసుకొని చిత్తు చిత్తు అయిన నిమ్నవర్ణ మహిళలు తమ రొమ్ములను బట్టతో కప్పి ఉంచి వీధుల్లో తెరిగేవారు. అధికారులు ప్రశ్నిస్తే.. ధీటుగా సమాధానం ఇచ్చేవారు. ఒంటరి పోరాటం వల్ల ఫలితం ఉండదని భావించిన ఆమె.. చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. బహిరంగ ప్రదేశాల్లో వస్త్రాలు ధరించి తిరిగేది. బాధిత మహిళలను అక్కున చేర్చుకొని పోరాటం సాగించింది. మహిళలు వస్త్రాలు ధరించి వీధుల్లోకి రావడాన్ని చూసిన అధికారులు వ్యతిరేకతను జీర్ణించుకోలేక ప్రజల్లో మళ్లీ భయాన్ని పెంచాలని.. భారీ సైన్యంతో ఆమె ఇంటిని చుట్టుముట్టారు.
అధికారుల నంగేలీని చుట్టుముట్టి పన్ను వసూలు చేసే ప్రయత్నం చేశారు. నీకు ఎందుకు కట్టాలిరా శిస్తు? నా శరీరంపై నీ పెత్తనం ఏందిరా? అని ఆమె పోరాడింది. ఇక అధికారులు ఆమె పైవస్త్రాలను తొలగించి అత్యాచారానికి సిద్ధమయ్యారు. దీంతో ఆమె పన్ను కడతానని చెప్పి ఇంట్లోకి వెళ్ళింది. పదునైన కొడవలితో బయటకు వచ్చి తన రొమ్ములను కోసింది. అరిటాకులో వాటిని పెట్టి.. రక్తమోడుతున్న చాతితో.. ఈ రక్తపు ముద్దలను పన్నుగా తీసుకోండి అంటూ కోసిన రొమ్ము భాగాలను అధికారుల ముఖం మీదకు విసిరేసింది. ఒక్క క్షణం అక్కడి వారంతా దిగ్భ్రాంతికి లోనై అలాగే చూడసాగారు. భయపడిన అధికారులు తక్షణమే అక్కడి నుంచి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో నంగేలీ ప్రాణం విడించింది. నంగేళికి అన్ని విధాలా స్పూర్తినిస్తూ తనకు ధైర్యంగా నిలిచిన ఆమె భర్త.. ప్రాణం కంటే ఎక్కువగా భావించిన ఆమె మరణాన్ని తట్టుకోలేకపోయాడు. ఆమె భౌతిక కాయాన్ని దహనం చేస్తుండగా చితిలోకి దూకి ఆమెతోపాటే ఆ జ్వాల్లల్లో అగ్నికి ఆహుతి అయ్యాడు.
ఈ ఘటనతో ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుంది. నంగేలీ, ఆమె భర్త మరణాలు వృథా కాకూడదని పాలకుల ఆగడాలపై పోరాడితేనే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రాణాలకు తెగించి పోరాటానికి సిద్ధమయ్యారు. అగ్రవర్ణాలపై తిరగబడ్డారు. పాలకుల వెన్నులో వణుకు పుట్టించారు. నంగేళి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని తిరుగుబాటు చేశారు. దీంతో అధికారులు భయపడిపోయారు. ఈ తిరుగుబాటు వల్ల ప్రజలకు అమానుష చట్టాల నుంచి విముక్తి లభించింది. నంగేలీ త్యాగం కేరళలో నవ సమాజ స్థాపనకు మార్గం చూపింది. దుర్మార్గపు పాలనను అంతం చేసింది. గొప్ప త్యాగం చేసి ప్రాణాలు విడిచిన నంగేళిని ఒక దేవతలా కేరళ ప్రజలు ఇప్పటికి ఆరాధిస్తున్నారు.