TTD: టీటీడీలో సరికొత్త కార్యక్రమం

భారత్ సమాచార్.నెట్, తిరుమల: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక సంస్థగా విరాజిల్లుతున్న టీటీడీ మరోసరికొత్త ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. హిందూ సనాతన ధర్మం గురించి విద్యార్థులకు బోధించడం.. అలాగే వారిలో నైతిక విలువలను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది టీటీడీ. సద్గమయ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది.

 

ఈ నెల 28న టీటీడీ పాఠశాలల్లో సద్గమయ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు టీటీడీ తెలిపింది. నాలుగు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుందని.. తిరుపతి, తిరుమలలోని 7 పాఠశాలల్లో డే స్కాలర్లకు రోజుకు ఒక గంట చొప్పున నాలుగు రోజుల పాటు సద్గమయ శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాసం, ఆధ్యాత్మిక, సామాజిక, నైతిక విలువలు, నైపుణ్యాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, వాస్తవ ప్రపంచాన్ని అధ్యయనం చేయడం, వ్యక్తిగత పురోగతి, నాయకత్వ లక్షణాలు వంటి తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.

 

అలాగే సనాతన ధర్మ వ్యాప్తికి దోహదపడేందుకు సరికొత్త కార్యక్రమాన్ని చేపడుతోంది. ఆగస్ట్ 8న సౌభాగ్యం, ఆగస్ట్ 15న సన్మార్గం, ఆగస్ట్ 31న హరికథ వైభవం, అక్టోబర్ 2న వారసత్వం, అక్టోబర్ 12న అక్షరగోవిందం, డిసెంబర్ 1న భగవద్గీతానుష్టానం భోదన, సంప్రదాయ భజనపై భజే శ్రీనివాసం, సంప్రదాయ భజన శిక్షణ కార్యక్రమాన్ని టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది. వీటితో పాటు వన నిధి, గిరిజనార్థనం వంటి కార్యక్రమాలను కూడా టీటీడీ తీసుకొస్తోంది.

Share This Post