భారత్ సమాచార్.నెట్, చెన్నై: 2029లో జరిగే పార్లమెంట్ ఎన్నికల తర్వాతే ‘జమిలి ఎన్నికలు’ (One Nation One Election)అమల్లోకి వస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman)స్పష్టం చేశారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనే ప్రక్రియను 2029 తర్వాతే రాష్ట్రపతి ప్రారంభిస్తారని చెప్పిన నిర్మలా సీతారామన్.. 2034లో జమిలి ఎన్నికలు జరగే అవకాశం ఉంటుందన్నారు. జమిలి ఎన్నికలకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని నిర్మలా సీతారామన్ తోసిపుచ్చారు. తమిళనాడు (Tamil Nadu)లోని చెంగల్పట్టు జిల్లాలో పరిధిలోని కాట్టాన్‌కొళత్తూరు ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో జరిగిన ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ అనేది కొత్త ఆలోచన కాదని, ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అని పేర్కొన్నారు. జమిలి ఎన్నికలు ఎవరి వ్యక్తిగత కార్యక్రమం కాదని, అన్ని పార్టీలు మద్దతిస్తేనే అమలులోకి వస్తుందని తెలిపారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపు రూ. లక్ష కోట్లు ఖర్చు చేశారని.. జమిలి ఎన్నికలతో ఈ భారీ వ్యయం ఆదా అవుతుందన్నారు. పార్లమెంట్, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే.. దేశ జీడీపీలో 1.5 శాతం పెరుగుదల కనపిస్తుందన్నారు. విలువ పరంగా చూస్తే.. ఆర్థిక వ్యవస్థకు రూ. 4.5లక్షల కోట్లు చేకూరుతాయని.. జమిలి ఎన్నికల వల్ల కలిగే ప్రయోజనానికి ఇదో ఉదాహరణ అని చెప్పారు.
జమిలి ఎన్నికలపై కొన్ని పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. ఈ విధానంపై గతంలో అనేకసార్లు చర్చలు జరిగాయని.. వాటికి ఇప్పుడు పునాది మాత్రమే పడిందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రమే దీన్ని తీసుకురాలేదని.. 1960 నుంచి ఇది ఉనికిలో ఉందన్నారు. డీఎంకే దివగత నేత కరుణానిధి కూడా దీనికి మద్దతిచ్చారని.. ఆయన కుమారుడు ( ప్రస్తుత సీఎం ఎంకే స్టాలిన్) మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారన్నారు. రాజకీయ అవసరాల కోసం తండ్రి మాటకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని.. ఇది ప్రజలు గమనించాలని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.