భారత్ సమాచార్, హైదరాబాద్ ;
భువిపై తెలుగు జాతి ఉన్నంత వరకు, ప్రపంచంలో తెలుగు మాట వినిపించినంత వరకు నందమూరి తారక రామారావు అనే పేరు ప్రతి ధ్వనిస్తూనే ఉంటుంది. యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవ ప్రతీక, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానాయకుడు, దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహనీయునికి తెలుగు సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులంతా ఆయనను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నారు.
హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద తారక రాముడి కుటుంబ సభ్యులు, తెలుగు దేశం పార్టీ నాయకులు నివాళులు అర్పిస్తున్నారు. తెలుగువారి ఆరాధ్యదైవం ఎన్టీఆర్ అని, రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడని, ఎన్టీఆర్ పథకాలనే అందరూ అవలంబిస్తున్నారని, ఎన్టీఆర్ స్ఫూర్తితో మరింతగా ప్రజలకు సేవ చేస్తామని నందమూరి బాలకృష్ణ అన్నారు.
మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గెండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గెండెని మరొక్కసారి తాకిపో తాత… నీ ప్రేమకు బానిసను… జూ.ఎన్టీఆర్
‘‘కొందరి కీర్తి అజరామరం. తరతరాలకు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ, వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను’’…ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి.