భారత్ సమాచార్.నెట్: ఉప రాష్ట్రపతిగా పదవి కాలం ముగియక ముందే.. అనారోగ్య కారణాలతో హఠాత్తుగా జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్ర పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామా చేయడం దేశ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు రాత్రే ఆయన రాజీనామా చేయగా.. ధన్కర్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
అయితే జగదీప్ ధన్కర్ రాజీనామాపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికార పార్టీ స్పష్టత ఇవ్వకపోవడాన్ని కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జగదీప్ ధన్కర్‌కు అధికారికంగా వీడ్కోలు ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్షాలు కేంద్రాన్ని కోరినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో స్వయంగా ప్రతిపక్షాలే ఆయనకు విందు ఇచ్చేందుకు నిర్ణాయించినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
విపక్షాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ వీడ్కోలు విందుకు జగదీప్ ధన్కర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు సమాచారం. అయితే విపక్షాల ఆహ్వానాన్ని ధన్కర్ అంగీకరించకపోవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే జగదీప్ ధన్కర్ తన అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయన వ్యక్తిగత వస్తువులు ప్యాక్ చేస్తున్న సంబంధిత వర్గాలు తెలిపాయి. అధికార నివాసాన్ని ఖాళీ చేస్తున్న ఆయనకు ఢిల్లీలోని ల్యూటెన్స్ ప్రాంతంలోని టైప్ 8 ప్రభుత్వ బంగ్లాను కేటాయించనుంది కేంద్రం.