Homebreaking updates newsవక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మూడు పిటిషన్‌లు

వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో మూడు పిటిషన్‌లు

భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: అధికార ఎన్డీఏ (NDA), ఇండియా కూటమి (INDIAN Alliance) మధ్య తీవ్ర వాగ్వాదాలకు కేంద్ర బిందువుగా నిలచిన వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Bill) 2025 మరో మలుపు తిరిగింది. ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం తెలపకముందే ఈ అంశం సుప్రీంకోర్టు (Supremecourt)కు చేరింది. ఈ బిల్లును ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్ధీన్ ఒవైసీ (Asaduddin Owaisi), కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్‌ (Mohammad Jawed), ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్‌ (Amanatullah Khan)లు సుప్రీంకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. కాగా, ఇండియా కూటమిలోని కాంగ్రెస్, ఎస్పీ, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), ఎంఐఎం, టీఎంసీ వంటి పార్టీలు బిల్లుకు తీవ్రంగా వ్యతిరేకించగా.. ఎన్డీఏకు ఉన్న సంఖ్యా బలంతో ఈ బిల్లును ఆమోదించారు.

వక్ఫ్‌ బిల్లు చట్ట విరుద్ధమని.. వక్ఫ్‌ ఆస్తులు లాక్కునే కుట్ర జరుగుతోందంటూ పేర్కొన్నారు. ఈ వక్ఫ్ బిల్లు నిబంధనలు ముస్లిం సమాజ ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సవరణలు ముస్లింల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తాయని.. ఇస్లామిక్ మతపరమైన ఆస్తులపై ప్రభుత్వం ఎక్కువ నియంత్రణ పెట్టేలా ఉందని వారు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ జావేద్ ఈ సవరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 25, 26, 29, 300ఏ లను ఉల్లంఘిస్తాయనే వాదనను వినిపిస్తున్నారు. ఈ ఆర్టికల్స్ సమానత్వం, మత స్వేచ్ఛ, మైనారిటీ హక్కులు, ఆస్తి హక్కులకు సంబంధించినవని.. ఈ బిల్లు వల్ల ఆంక్షలు వస్తాయన్నారు.

ఈ సవరణలు ముస్లింల మతపరమైన, సాంస్కృతిక స్వయంప్రతిపత్తికి భంగం కలిగిస్తాయని ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ జోక్యం వల్ల మైనారిటీలకు ఉండే మతపరమైన, స్వచ్ఛంద సంస్థల నిర్వహణ హక్కులు దెబ్బతింటాయని అన్నారు. వక్ఫ్ బిల్లు ద్వారా తీసుకువచ్చిన సవరణలు రాజ్యాంగబద్ధతకు భంగం కలిగిస్తాయని, సమానత్వ హక్కు, మత స్వేచ్ఛ, మైనారిటీల హక్కులు వంటి ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆయన తన వాదనల్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. అయితే బిల్లుపై వ్యతిరేక వాదనలు, రాజ్యాంగ సంబంధిత చర్చలు కొనసాగుతుండటంతో, దీనిపై సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారనుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments