PM Modi: ఇందిరా గాంధీ రికార్డును బ్రేక్‌ చేసిన ప్రధాని మోదీ

భారత్ సమాచార్.నెట్: భారత్ ప్రధాని నరేంద్ర మోదీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశ రాజకీయాల్లో ప్రధాని మోదీ రికార్డు సృష్టించారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఇందిరా గాంధీ పేరిట ఉన్న రికార్డును నరేంద్ర మోదీ అధిగమించారు. 2025 జూలై 25 నాటికి భారత్ ప్రధానిగా 4,078 రోజులు పనిచేసిన రెండో వ్యక్తిగా ప్రధాని మోదీ నిలిచారు. 1966 జనవరి 24 నుంచి 1977 వరకు వరుసగా 4,077 రోజులు ఇందిరా గాంధీ భారత్ ప్రధానిగా పనిచేశారు. తాజాగా ఆమె రికార్డును బ్రేక్ చేశారు మోదీ.

 

అయితే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన తొలి వ్యక్తిగా దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ నిలవగా.. ఆయన తర్వాతి స్థానంలో మోదీ ఉన్నారు. 1947 ఆగస్ట్ 15 నుంచి 1964 మే 27 వరకు 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ పనిచేశారు. ఇక స్వాతంత్య్రం అనంతరం జన్మించిన వారిలో ఎక్కువ కాలం ప్రధానిగా కొనసాగిన నేతగా 74 ఏళ్ల మోదీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు కాంగ్రెసేతర పార్టీ నుండి ఎక్కువ కాలం ప్రధాన మంత్రిగా పనిచేసిన వ్యక్తిగా కూడా నరేంద్ర మోదీ నిలిచారు.

 

1971లో ఇందిరా గాంధీ తర్వాత అత్యధిక మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధానిగా మోదీ గుర్తింపు పొందారు. గతేడాది జూన్‌లో వరుసగా మూడోసారి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. 2014 మే 26న తొలిసారిగా ప్రధానిగా ప్రమాణం చేసిన మోదీ.. ఆ తర్వాత జరిగిన రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ తన నాయకత్వంలో బీజేపీని గెలిపించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి భారత్ ప్రధానిగా ఎదిగిన నరేంద్ర మోదీ ఈ అరుదైన ఘనతను సాధించారు.

Share This Post