భారత్ సమాచార్.నెట్: భారత ప్రధాన మంత్రి (Indian Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) ఈరోజు రాత్రి 8 గంటలకు దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు (Address The Nation) . ఈ క్రమంలోనే ప్రధాని మోదీ (PM Modi) ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor)పై స్పందించబోతున్నారా.. లేదా ఇతర కీలక అంశాలపై ప్రకటన చేయబోతున్నారా? అనే ఉత్కంఠ దేశ వ్యాప్తంగా నెలకొంది. ఇటీవల భారత సాయుధ దళాలు ‘ఆపరేషన్ సింధూర్’ను విజయవంతంగా పూర్తి చేయడం, ఆ తర్వాత పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆపరేషన్ అనంతరం ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి మాట్లాడటం ఇదే తొలిసారి.
మరోవైపు భారత్ పాక్ మధ్య జరుగుతున్న డీజీఎంఓల చర్చల్లో ఇరు దేశాలు కీలక డిమాండ్లు ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా భారత్ 3 కీలక డిమాండ్లు పెట్టనున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఉగ్రవాదులకు సాయం నిలిపివేయాలి, మసూద్ అజార్, హఫీజ్, దావూద్ ఇబ్రహీంను భారత్‌కు అప్పగించాలి. అలాగే పీవోకేను కూడా అప్పగించాలనే డిమాండ్లు భారత్ చర్చల్లో ప్రతిపాదించనున్నట్లు సమాచారం. మరీ పాక్ ఏ గొంతెమ్మ కోరికలు కోరుతుందో చూడాలి మరీ.
ఇకపోతే ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ నెల 7న భారత్ త్రివిధ దళాలు మెరుపు దాడులు చేశాయి. ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్ భూభాగం, పీఓకేలలో ఉన్న తొమ్మిది ఉగ్రవాద శిక్షణా శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేసింది భారత్. ఈ సైనిక చర్యలో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. కాగా రెండు రోజుల క్రితం ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణకు ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే.