భారత్ సమాచార్, జాతీయం ; 2024 సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్ దాదాపుగా ప్రశాంతంగా ముగిసింది. కొన్ని చెదురు ముదురు ఘటనలు మినహా, చాలా చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ నమోదైంది. కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో స్వల్ప ఉద్రిక్తతలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చాలా వరకూ సాఫీగానే జరిగింది. రెండో విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు, పలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 88 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ను నిర్వహించారు. ఉదయం 7 గంటల నుంచే మొదలైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 6 గంటల వరకు నిరంతరాయంగా కొనసాగింది. ఛత్తీస్‌గఢ్‌లో రాష్ట్రంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ఎన్నికల అధికారులు 3 గంటలకే పోలింగ్ ను ముగించారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసేందుకు ఎలక్షన్ కమిషన్ అవకాశం కల్పించింది. దీంతో చాలా పోలింగ్ కేంద్రాల్లో సాయంత్రం 6 తర్వాత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ లో ఉన్న ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఈ మొత్తం రెండో విడత లోక్ సభ స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. కేరళ, పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలలో లోపాలు, బోగస్ ఓట్లతో కొన్ని చోట్ల చిన్నపాటి ఇబ్బందులు తలెత్తాయి. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, రాజస్థాన్‌లో బన్స్వారా, మహారాష్ట్ర, త్రిపురలోని పర్భానిలలో పలు గ్రామాల్లో వివిధ కారణాలతో ఓటర్లు పోలింగ్‌ను బహిష్కరించి తమ తమస్యలపై నిరసన తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు త్రిపుర రాష్ట్రంలో అత్యధికంగా 77 శాతం ఓటింగ్ నమోదైంది. అస్సాంలో 70.66 శాతం, బిహార్‌లో 53.03, ఛత్తీస్‌గఢ్ 72.13, జమ్మూకశ్మీర్ 67.22, కర్ణాటక 63.90, కేరళ 63.97, మధ్యప్రదేశ్ 54.83, మహారాష్ట్ర 53.51, మణిపుర్ 76.06, రాజస్థాన్ 59.19, త్రిపుర 77.53, ఉత్తరప్రదేశ్ 52.74, పశ్చిమబెంగాల్ 71.84 శాతం చొప్పున పోలింగ్ నమోదైనట్లు ఈసి అధికారులు వెల్లడించారు. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈ సారి కొన్ని రాష్ట్రాల్లోని లోక్ సభ్ నియోజకవర్గాల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదు అయినట్లు ఎన్నికల కమిషన్ అధికారులు పేర్కొన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద తాగునీరు, మురుగుదొడ్లు వంటి ఓటర్లకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్టు ఈసీ అధికారులు వెల్లడించారు. ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఓటు హక్కును వినియోగించుకోవటం తమ బాధ్యతగా స్వీకరించాలని అధికారులు కోరారు.
మూడో దశ పార్లమెంటు ఎన్నికలు 12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 94 నియోజకవర్గాల్లో మే 7వ తేదీన జరగనున్నాయి. దీంతో ఆ రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీల అభ్యర్థులు, ముఖ్య నాయకులు ముమ్మురం చేశారు. గెలుపే లక్ష్యంగా స్థానిక, జాతీయ పార్టీలన్ని తమ వ్యూహ, ప్రతి వ్యూహాలను పదునుపెట్టాయి. మోదీ దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇదే తరుణంలో కాంగ్రెస్ నాయకులు రాహుల్, ప్రియాంక గాంధీలు ఎన్నికల ప్రచారంలో వివిధ లోక్ సభ నియోజకవర్గాల్లో వేర్వేరుగా పాల్గొని ప్రచారం సాగిస్తున్నారు. ఇలా మొత్తం ఏడు దశల్లో 2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జూన్ 4వ తేదీన దేశ ఓటర్ల తీర్పును వెల్లడించనున్నారు.