భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ (Greater Hyderabad)తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా వర్షం (Rain) బీభత్సం సృష్టించింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్‌లోని అనేక కాలనీలు మురుగు నీటితో నిండిపోయాయి. పలు బస్తీల్లో రహదారులు కొట్టుకుపోయాయి. లింగంపల్లి అండర్‌పాస్ వద్ద భారీగా వర్షపు నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నాలాలు పొంగి ప్రవహించడంతో.. రహదారులు చెరువులను తలపించాయి.
పాక్షికంగా దెబ్బతిన్న చార్మినార్
ఎల్బీనగర్, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, నారాయణగూడ నుంచి రాష్ట్ర సచివాలయం, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వరదనీరు రహదారులను ఆక్రమించింది. వాహనాల రాకపోకలు గంటల తరబడి నిలిచిపోయాయి. ఖైరతాబాద్, ఆనందనగర్, దిల్‌సుఖ్‌నగర్, రామ్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. చెట్ల కొమ్మలు విరిగిపడటంతో అనేక చోట్ల విద్యుత్తు స్తంభాలు దెబ్బతిన్నాయి.
మరోవైపు నగరంలో వర్షం ధాటికి చారిత్రక కట్టడం చార్మినార్ (Charminar) పాక్షికంగా దెబ్బతింది. భాగ్యలక్ష్మి దేవాలయం (Bhagyalaxmi Temple) వైపు ఉన్న మినార్ (Minar) పైభాగం నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. అదృష్టవశాత్తూ, ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గతంలో కూడా భారీ వర్షాల నేపథ్యంలో ఇదే మినార్ పైభాగం నుంచి పెచ్చులు ఊడిపడిన విషయాన్ని స్థానికులు గుర్తు చేస్తున్నారు. కాగా చార్మినార్‌కు నాలుగు మినార్‌లు ఉండగా, వాటిలో ఓ మినార్‌కు పగుళ్లు ఏర్పాడ్డాయి. గతంలో ఒక మినార్ పెచ్చులు ఊడి నేలపై పడిపోయాయి. ఆ తర్వాత ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు కట్టడాన్ని పరిశీలించి మరమ్మతు చర్యలు చేపట్టారు.