భారత్ సమాచార్, హైదరాబాద్ : మ్యానిఫెస్టోలో చెప్పినట్టుగా ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన రెండు రోజులకే రెండు గ్యారెంటీలను అమల్లోకి తీసుకొచ్చింది. మొదటిది ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండోది ఆరోగ్యశ్రీ చికిత్స పరిధి రూ.10లక్షలకు పెంపు. ఈరెండు ఏ సమస్యలు లేకుండా సజావుగా సాగిపోతున్నాయి. ఇక మిగతా గ్యారెంటీలను అమలు చేయడానికి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ‘ప్రజాపాలన’ పేరుతో గ్రామ, బస్తీ సభలు ఏర్పాటు చేసింది.
ప్రజాపాలన కార్యక్రమంలో డిసెంబర్ 28న ప్రారంభించారు. ఇది జనవరి 6 దాక కొనసాగనుంది. 5 గ్యారెంటీలకు లబ్ధిదారులను ఎంపిక చేయడానికే ఈ దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో ప్రజలు గ్రామ, బస్తీ సభలకు పోటెత్తుతున్నారు. గ్యారెంటీ పథకాలైన మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులకు కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. లక్షలాది పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ పథకాలు కీలకం కావడంతో జనాలు సెంటర్ల బారులు తీరుతున్నారు.
దీంతో ప్రజాపాలన దరఖాస్తు ఫారాలకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. అందరికీ దొరకకపోవడంతో జిరాక్స్ సెంటర్ వాళ్లు రూ.50,-100లకు అమ్ముకుంటున్నారు. దీంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతీ గ్రామానికి, బస్తీకి ఒక నిర్ధిష్ట సమయం మాత్రమే పెట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తు ఫారంలు తమకు దొరకడం లేదని అధికారులపై మండిపడుతున్నారు. ప్రతీ కుటుంబానికి దరఖాస్తు ఫారం లభించేలా ఎక్కువగా ముద్రించి పంపిణీ చేయాలని అధికారులను కోరుతున్నారు. ఇక కొన్ని చోట్ల దరఖాస్తు ఫారాల కోసం జిరాక్స్ సెంటర్ల వద్ద కూడా క్యూ కట్టారు. దరఖాస్తును నింపలేక నిరక్షరాస్యులు ఇబ్బందులు పడ్డారు. ఈ ఫారంను నింపేందుకు డబ్బులు కూడా తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల అసలు దరఖాస్తులు ఎక్కడ లభిస్తున్నాయో సమాచారం లేక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికే రైతుబంధు, పింఛన్లు పొందుతున్న వారు సైతం మళ్లీ దరఖాస్తు చేయాలా అనే సందేహంతో వచ్చారు. ఇలా సందేహాలు, అనుమానాల మధ్య ప్రజాపాలన మొదలైంది. దీనిపై మంత్రులు, అధికారులు స్పందిస్తూ.. దరఖాస్తు ఫారంలను అమ్ముకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామ, బస్తీ సభల వేదికల వద్దనే అందరికీ సరిపోయేలా ఫారంలు ఇస్తామని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచిస్తున్నారు.