భారత్ సమాచార్.నెట్, మణిపూర్: రాజకీయ సంక్షోభం నెలకొన్న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ రాష్ట్రంలో మరి కొంతకాలం రాష్ట్రపతి పాలనను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్రపతి పాలనను కేంద్రం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ.. రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 13 నుంచి ఇది అమలు కానుండగా.. 2026 ఫిబ్రవరి 13 వరకు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది.
అయితే అక్కడి పరిస్థితులు ప్రస్తుతం సద్దుమణుగుతుండటంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. రాష్ట్రపతి పాలనను పొడిగిస్తూ పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనికి సభ కూడా ఆమోదం తెలిపింది. తాజా పరిణామంతో మరో ఆరు నెలలు అక్కడా రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. 2022లో మణిపూర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. మణిపూర్ శాసనసభ కాలపరిమితి 2027లో ముగియనుంది.
ఇకపోతే రెండు తెగల మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతలు, హింసాత్మక ఘటనలతో మణిపూర్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అక్కడి పరిస్థితులు తీవ్రంగా దిగజారిపోవడంతో ఫిబ్రవరి 13 2024లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. సీఎం బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపై క్లారిటీ లేకపోవడంతో అదే రోజు నుంచి అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది కేంద్రం.