భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారమంతా నిరుద్యోగుల చుట్టూ నే తిరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా నిరుద్యోగ జపం చేస్తున్నాయి. మొన్నటికి మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అశోక్ నగర్ నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించారు. జాబ్ క్యాలెండర్ ను కచ్చితంగా తెస్తామని, గ్రూప్-2 లో వచ్చేసారి మరిన్ని పోస్టులు పెంచుతామని, నిరుద్యోగుల సమస్యలు అన్నింటినీ వెంటనే పరిష్కరిస్తామని హామీ కూడా ఇచ్చి వెళ్లారు. డిసెంబర్ 3న ఎన్నికల ఫలితాలు వచ్చాక తెల్లారే అశోక్ నగర్ లో నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. తాజాగా శనివారం రాహుల్ గాంధీ నిరుద్యోగులు అత్యధికంగా ఉండే చిక్కడపల్లిలో సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద వారి సాధక బాధకలు గురించి ముచ్చటించారు.
రాత్రి 8.30 గంటల సమయంలో చాలా సాదాసీదాగా కాంగ్రెస్ పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మూడు కార్లలో అక్కడికి చేరుకున్నారు. రాహుల్ కిందికి దిగి లైబ్రరీ వద్ద నున్న శ్రీ శివసాయి బేకరీ వద్ద నిరుద్యోగ యువకుల దగ్గరికి వెళ్లి పలకరించారు. దీంతో ఒక్కసారిగా రాహుల్ ను చూసి అక్కడి విద్యార్థులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఈ విషయం తెలిసిన అశోక్ నగర్ నిరుద్యోగులు వందలాదిగా అక్కడికి తరలివచ్చారు. దేశస్థాయి సెలబ్రిటీ తమ దగ్గరికే రావడం వారిని సంతోషపరిచింది. వారితో టీ తాగిన రాహుల్ .. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పై ఎందుకు అసంతృప్తిగా ఉన్నారు? యూపీఎస్సీకి, టీఎస్పీఎస్పీకి వైరుధ్యం ఏమిటి ? ప్రిపరేషన్ తో ఇంట్లో సమస్యలు వస్తున్నాయా? అలాగే నిరుద్యోగుల బలవన్మరణాలపై కూడా వారిని ఆరా తీశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత తనదేనని వారికి రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ నె కచ్చితంగా ప్రకటించి అమలు పరుస్తామన్నారు. నిరుద్యోగుల ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. అరగంటకు పైగా వారితో చర్చించిన రాహుల్ తర్వాత.. విద్యార్థులతో కలిసి ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని బావర్చి హోటల్ లో బిర్యానీ తిన్నారు. అక్కడికి వచ్చిన కస్టమర్లు ఆయనతో సెల్ఫీలు దిగారు.