భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: కుటుంబ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్హాబాదియా (Ranveer Allahbadia) జాతీయ మహిళా కమిషన్ (National Commission for Women)కు క్షమాపణలు చెప్పాడు. గురువారం జాతీయ మహిళా కమిషన్ ప్యానెల్ ముందు రణ్‌వీర్ అల్హాబాదియా, ముఖిజా, ప్రొడ్యూజర్లు సౌరభ్ బోత్రా, తుషార్ పూజారిలు హాజరయ్యారు. ఇద్దరు యూట్యూబర్లను కొన్ని గంటల పాటు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అసభ్యకరమైన భాషను ఆమోదించబోమని కమిషన్ స్పష్టం చేసింది. సామాజిక ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని, వాళ్లకు నోటీసులు ఇచ్చామని, కమిషన్ ముందు హాజరైన వాళ్లు క్షమాపణలు చెప్పినట్లు కమిషన్ వెల్లడించింది.
ఇకపై మహిళలను గౌరవిస్తానని.. గతంలో జరిగిన ఘటనను మార్చలేమని.. ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానని రణ్‌వీర్ అల్హాబాదియా పేర్కొన్నాడు. కాగా ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో రణ్‌వీర్ అల్హాబాదియా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారమే రేపాయి. రణ్‌వీర్ అల్హాబాదియా వ్యాఖ్యలును సుప్రీంకోర్టు (Supreme Court) కూడా తప్పుపట్టింది. పాపులారిటీ ఉంటే ఏది పడితే అది మాట్లాడతారా అంటూ రణ్ వీర్‌ను తీవ్రంగా మందలించింది. అంతేకాదు కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లే ప్రయత్నాలు చేయొద్దని.. పాస్ పోర్టును పోలీసులకు అప్పగించాలని సూచించింది.
ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో రణ్‌వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టు కాస్త ఊరట లభించింది. పాడ్‌కాస్ట్‌ను రద్దు చేయాలన్న ప్రాసిక్యూషన్ వాదనను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. దానిని తిరిగి ప్రారంభించుకునేందుకు రణ్‌వీర్‌కు అనుమతినిచ్చింది. ఈ సందర్భంగా రణ్‌వీర్‌కు మరోసారి చీవాట్లు పెట్టింది. భావప్రకటనా స్వేచ్ఛకు పరిమితులు ఉన్నాయని.. అసభ్య పదజాలం వాడటం హాస్యం కాదని మందలించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు అతని అరెస్ట్ చేయొద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో కోర్టు ఉత్తర్వలు ఇచ్చేవరకు ఎలాంటి షోలు చేయకూడదని తేల్చిచెప్పింది.