భారత్ సమాచార్, జాతీయం ;
ప్రపంచ పారిశ్రామిక యోధుడు, భారతీయ దాన కర్ణుడు, నిరాడంబరుడు, టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా (86) అనారోగ్య కారణాలతో ముంబయిలో బుధవారం రాత్రి కన్నుమూశారు. రెండు రోజుల ముందు అనారోగ్యం కారణంగా ఆయన ఆసుపత్రిలో చేరారు. రతన్ టాటా మరణాన్ని ధృవీకరిస్తూ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఒక ప్రకటన విడుదల చేశారు. అధికార లాంఛనాలతో రతన్ టాటా అంత్యక్రియలు జరుపుతామని మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఆయన పార్థీవ దేహాన్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం ముంబయిలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్(ఎన్‌సీపీఏ)లో ఉంచనున్నారు.
రతన్ టాటా 1937 డిసెంబర్ 28న నావల్ టాటా, సూనూ టాటా దంపతులకు జన్మించారు. ఆయన పాఠశాల విద్య ముంబయిలో పూర్తయింది. అమెరికాలోని కార్నెల్ యూనివర్శిటీలో ఇంజినీరింగ్ చదివారు. 1962లో టాటా ఇండస్ట్రీస్‌లో చేరారు. 1991లో టాటా గ్రూప్‌కు చైర్మన్‌గా నియమితులై, 2012 వరకు ఆ బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన టాటా గ్రూప్ గౌరవ చైర్మన్‌గా కొనసాగారు. రతన్ టాటాకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది. 2023లో ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియాతో ఆ దేశం రతన్ టాటాను గౌరవించింది.
రూ.10వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు..
రతన్జ 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎప్పుడూ దేశానికి తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. బాధ్యతలు స్వీకరించిన సమయంలో కంపెనీ రెవెన్యూ రూ.10వేల కోట్లుగా ఉంది. తర్వాత అంతర్జాతీయ స్థాయిలో టాటా గ్రూపును విస్తరించారు. స్టీల్, ఆటో మొబైల్ వంటి రంగాల్లో విస్తృతపరిచారు. కంపెనీ బ్రాండ్ వాల్యూను కొనసాగిస్తూ చేపట్టిన సంస్కరణలతో పదవి నుంచి దిగిపోయే సరికి రెవెన్యూను రూ. లక్ష కోట్లకు చేర్చారు. టాటా కంపెనీ లో జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ తో సమానం. ఇది నానుడి కాదు నిజం. దానిలో తాత..కొడుకు..మనవడు ..మూడు తారలు పని చేసిన కుటుంబాలు ఎన్నో. వ్యాపారం అనేది సమాజాభివృద్ధి కి తప్పితే మన సొంత అభివృద్ధి అనుకోకుండా అని నడిపిన వ్యక్తి టాటా.
పెళ్లి చేసుకోని రతన్ టాటా
అత్యంత నిరాడంబరంగా జీవించిన రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. ముంబైలోని అత్యంత చిన్న ఇంట్లో ఆయన ఉండేవారు. తన టాటా సెడాన్ కారును ఆయనే నడిపేవారు. ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడే ఆయన మీడియా ప్రచారానికి దూరంగా ఉండేవారు. తనతోపాటు పుస్తకాలను, సీడీలను, పెంపుడు కుక్కలను ఉంచుకునేవారు. 1970లలోనే ఆయన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. ఆగాఖాన్ ఆసుపత్రి, వైద్య కళాశాలకు శ్రీకారం చుట్టారు. విద్యా రంగానికి మరింత ప్రోత్సాహమిచ్చారు.