HomeUncategorizedడిగ్రీతో ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీ

డిగ్రీతో ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీ

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 450 అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదలచేసింది. డిగ్రీ అర్హతతో ఈ పరీక్షకు పోటీ పడవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులతో నియామకాలు చేపడతారు. ఎంపికైనవారు మొదటి నెల నుంచే సుమారు రూ.48 వేల వేతనం అందుకోవచ్చు. అనుభవం, శాఖాపరమైన పరీక్షల ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు.

అసిస్టెంట్లుగా చేరినవారు బ్యాంకుల లావాదేవీలను పరిశీలిస్తారు. వీరు మూడేళ్ల ఉద్యోగ అనుభవం తర్వాత శాఖాపరమైన పరీక్షల ద్వారా గ్రేడ్‌ ఎ, అనంతరం గ్రేడ్‌ బి స్థాయిని అందుకోవచ్చు. అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ముందుగా ప్రాథమిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించినవారికి ప్రధాన పరీక్ష ఉంటుంది. ఈ దశను దాటిన వారు భాషా నైపుణ్య పరీక్షలో అర్హత సాధించడం తప్పనిసరి. ఈ మార్కులను తుది నియామకాల్లో పరిగణనలోకి తీసుకోరు. ప్రధాన పరీక్ష స్కోరుతో మెరిట్, రిజర్వేషన్లు అనుసరించి ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. అసిస్టెంట్‌గా చేరిన వారికి రూ.20,700 మూలవేతనం చెల్లిస్తారు. విధుల్లో చేరినవారు మొదటి నెల నుంచే రూ.47,849 వేతనం పొందవచ్చు. దీనికి హెచ్‌ఆర్‌ఏ అదనంగా లభిస్తుంది. హైదరాబాద్‌ లాంటిచోట్ల విధులు నిర్వర్తించినవారికి ఆర్‌బీఐ వసతి గృహాల్లో అవకాశం లభించకపోతే ప్రారంభం నుంచే సుమారు రూ.పది వేల హెచ్‌ఆర్‌ఏ అందుతుంది.

ప్రాథమిక పరీక్ష

దీన్ని వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు వస్తాయి. వీటిని 3 విభాగాల నుంచి అడుగుతారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30, న్యూమరికల్‌ ఎబిలిటీ 35, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి ఒక గంట. ఒక్కో విభాగానికి 20 నిమిషాల సమయాన్ని కేటాయించారు. ఇందులో అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు పది మందిని చొప్పున ప్రధాన పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు.

ప్రధాన పరీక్ష

200 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 200 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున.. రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్, న్యూమరికల్‌ ఎబిలిటీ, జనరల్‌ అవేర్‌నెస్, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ల్లో ప్రశ్నలు అడుగుతారు. విభాగాలవారీ కేటాయించిన సమయాల్లో వీటిని పూర్తిచేయాలి. జనరల్‌ అవేర్‌నెస్‌ విభాగానికి 25 నిమిషాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌కు 20 నిమిషాల వ్యవధి ఉంది. మిగిలిన ఒక్కో విభాగాన్నీ 30 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం పరీక్ష వ్యవధి 135 నిమిషాలు. ఇందులో సాధించిన మార్కుల మెరిట్‌ ప్రకారం విభాగాల వారీ ఒక్కో పోస్టుకు ఇద్దరిని చొప్పున లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ పరీక్షకు ఎంపిక చేస్తారు. ప్రాథమిక, ప్రధాన.. రెండు పరీక్షల్లోనూ రుణాత్మక మార్కులు ఉన్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. ప్రశ్నలు ఆంగ్లం, హిందీ మాధ్యమాల్లో అడుగుతారు. రెండు పరీక్షల్లోనూ విభాగాలవారీ అర్హత మార్కులు పొందడం తప్పనిసరి.

లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ

మెయిన్స్‌లో అర్హత సాధించినవారికి భాషా నైపుణ్య పరీక్ష (ఎల్‌పీటీ) నిర్వహిస్తారు. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న కార్యాలయానికి కేటాయించిన భాషలో ఈ పరీక్ష రాయాలి. హైదరాబాద్‌లోని 14 ఖాళీలకు మాత్రమే తెలుగు భాష పరీక్ష రాసే అవకాశం ఉంది. ముంబయి కార్యాలయంలో 101 ఖాళీలు ఉన్నాయి. అయితే వీటికి పోటీ పడటానికి మారాఠీ లేదా కొంకణి భాషలో ఉత్తీర్ణత తప్పనిసరి. హిందీ భాష వచ్చినవారు చండీగఢ్‌ 21/ కాన్పూర్‌ అండ్‌ లఖ్‌నవూ 55/ నాగ్‌పూర్‌ 19/ న్యూదిల్లీ 28 ఖాళీల్లో ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపికచేసుకుని పోటీ పడవచ్చు. బెంగళూరులో 58 ఖాళీలకు కన్నడ వచ్చిన వారికి అవకాశం దక్కుతుంది. అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఉత్తీర్ణులైతే చాలు. వయసు: సెప్టెంబరు 1, 2023 నాటికి 20 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే సెప్టెంబరు 2, 1995 – సెప్టెంబరు 1, 2003 మధ్య జన్మించిన వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 4. దరఖాస్తు రుసుం: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు రూ.50. మిగిలిన అందరికీ రూ.450. (జీఎస్‌టీ అదనం). ప్రిలిమినరీ పరీక్షలు: అక్టోబరు 21, 23 తేదీల్లో నిర్వహిస్తారు. మెయిన్‌ పరీక్ష తేదీ: డిసెంబరు 2. ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, కాకినాడ, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, చీరాల, విజయనగరం. తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్‌. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌  https://www.rbi.org.in/ ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

మరికొన్ని వార్తా విశేషాలు…

స్కాలర్ షిప్ కోసం ‘విద్యార్థి విజ్ఞాన్‌ మంథన్’

RELATED ARTICLES

Most Popular

Recent Comments