భారత్ సమాచార్.నెట్, మాస్కో: భారత్ ప్రధాని మోదీ (Indian Prime Minister)కి మరోసారి రష్యా (Russia) నుంచి ఆహ్వానం (Invitation) అందింది. మే 9న మాస్కోలో నిర్వహించే విక్టరీ డే (Victory Day) పరేడ్ వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోదీని ఆహ్వానించింది. ఈ మేరకు ఆ దేశ ఉప విదేశాంగ శాఖ మంత్రి ఆండ్రీ రుడెంకో (Andrey Rudenko) వెల్లడించారు. ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతారని తాము ఆశిస్తున్నట్లు ఆండ్రీ రుడెంకో తెలిపారు. ఇప్పటికే ఆహ్వానం పంపినట్లు.. పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఓ రష్యన్ వార్తా సంస్థ కూడా వెల్లడించింది.
1954లో రెండో ప్రపంచయుద్ధం (World War 2)లో సోవియట్ సైన్యం (Soviet Army) జర్మనీ (Germany)పై దాడిని ప్రారంభించింది. జర్మనీ కమాండర్ ఇన్ చీఫ్ మే 9న.. బేషరతుగా లొంగిపోయే చట్టంపై సంతకం చేశారు. కాగా నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా ‘విక్టరీ డే'(మే 9న)ని రష్యా నిర్వహిస్తుంది. జర్మనీపై విజయం సాధించి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రష్యా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వేడుకల్లో పాల్గొనాలని రష్యా తన మిత్రదేశాలకు ఆహ్వానం పంపుతోంది.
ఇదిలా ఉంటే ప్రధాని మోదీ గతేడాది జూలైలో రష్యాలో పర్యటించారు. దాదాపు ఐదేళ్ల తర్వాత ఆ దేశ పర్యటన చేపట్టారు. 2019లో వ్లాడివోస్టాక్లో జరిగిన ఆర్థిక సదస్సుకు హాజరైన ప్రధాని మోదీ.. భారత్‌లో పర్యటించాలని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మోదీ ఆహ్వానించారు. మోదీ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించినప్పటికీ.. పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదు. ఇక పుతిన్, మోదీలు తరచూ ఫోన్లో వివిధ అంశాలపై సంభాషించుకుంటారన్న విషయం తెలిసిందే.