భారత్ సమాచార్, జాతీయం ;
ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ పార్టీల గ్యారంటీల గురించి కాకుండా స్కామ్ ల గురించి మట్లాడుకుంటున్నారు. కర్ణాటకలోని వాల్మీకి ఆదివాసీ అభివృద్ధి కార్పొరేషన్‌లో జరిగిన కుంభకోణంపై మాజీ మంత్రి కేటీఆర్ కీలక ఆరోపణలు చేశారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆసక్తికర పోస్టు చేశారు. కర్ణాటక వాల్మీకి స్కామ్‌తో తెలంగాణ రాష్ట్ర నాయకులు, వ్యాపార వేత్తలకు లింకులు ఉన్నాయని ఆరోపించారు. కర్ణాటక ఎస్టీ కార్పొరేషన్ నుంచి రాష్ట్రానికి రూ.45 కోట్లు బదిలీ అయ్యాయని వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆ 45 కోట్ల నగదు డ్రా చేసిన బార్లు, బంగారు దుకాణాదారులు ఎవరు? అని ప్రశ్నించారు. ఆ బార్లు, బంగారు దుకాణాదారులతో కాంగ్రెస్ నేతలకు ఉన్న సంబంధం ఏంటో తెలియాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్‌లోని 9 మంది బ్యాంకు ఖాతాలకు రూ.45 కోట్లు కర్ణాటక రాష్ట్రం నుంచి బదిలీ అయ్యాయని వెల్లడించారు. అంతేకాదు.. ఈ వాల్మీకి స్కామ్‌కు సంబంధించి తెలంగాణలోనూ సిట్, సీఐడీ, ఈడీ సోదాలు జరిగాయని గుర్తుచేశారు. దర్యాప్తు సంస్థల సోదాల వార్తలను బయటకు రానివ్వకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. మొత్తం రూ.95 కోట్ల అవినీతి జరిగిందని సీఎం కర్ణాటక అసెంబ్లీలో ప్రకటించారు. సిద్ధరామయ్యను తొలగిస్తే తెలంగాణ ప్రభుత్వమూ కూలుతుందని కర్ణాటక మంత్రి సతీష్ అన్నారు. అసలు తెలంగాణ ప్రభుత్వం కూలుతుందని ఆ రాష్ట్ర మంత్రి ఎందుకు అనాల్సి వచ్చింది. ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినా.. ఈడీ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు. అసలు తెలంగాణ కాంగ్రెస్‌ను ఎవరు రక్షిస్తున్నారు? కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేశారు.