భారత్ సమాచార్, అమరావతి ;
పోలవరం ప్రాజెక్టు పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. రాష్ట్రాభివృద్ధికి పోలవరం జీవనాడి వంటిదని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలిపేందుకే శ్వేతపత్రం విడుదల చేస్తున్నట్టు చెప్పారు. మొత్తం ఏడు శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్టు తెలిపారు. వెబ్ సైట్ల ద్వారా పత్రాలన్నీ అందుబాటులో ఉంచుతామన్నారు. దుష్ప్రచారానికి చెక్ పెట్టేందుకే శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై రెండో శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.
పోలవరాన్ని జగన్ నాశనం చేశారని సీఎం ఆరోపించారు. పోలవరం ధ్వంసం జాతికి జరిగిన విద్రోహమన్నారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్ చేసిన నష్టం ఎక్కువన్నారు. 2014-19 మధ్య పోలవరానికి రూ.11,762 కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. మాజీ సీఎం జగన్ మూర్ఖత్వం వల్ల ఓ డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందన్నారు.
టీడీపీ హయాంలో పోలవరం 72 శాతం పూర్తయింది, వైసీపీ హయాంలో కేవలం 3.84 శాతం పనులే జరిగాయన్నారు. పోలవరం మరమ్మతుల కోసం అమెరికా, కెనడా నిపుణులను రప్పిస్తున్నామన్నారు. అమెరికా, కెనడా నిపుణులు ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తారని చెప్పారు. పోలవరం కోసం మేం పడిన శ్రమను జగన్ వృథా చేశారని వాపోయారు. పోలవరం ఎత్తు విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. పోలవరం సందర్శన సమయంలో నా కళ్ల వెంట నీళ్లు వచ్చాయని సీఎం అన్నారు.