భారత్ సమాచార్, చరిత్రలో ఈరోజు ;
ధవళేశ్వరం ఆనకట్ట లేని గోదావరి జిల్లాలను ఈ రోజు ఊహించుకోవటం కూడా కష్టమే. అందుకే ఆ ఆనకట్ట నిర్మించిన సర్ ఆర్థర్ కాటన్ (1803 మే 15 – 1899 జూలై 24) ను గోదావరి వాసులు ప్రేమగా కాటన్ దొరి అని పిలుస్తారు, ఇష్టంగా దేవుడిగా కూడా కొలుస్తారు. ఒక ప్రభుత్వ అధికారి చిత్తశుద్ధితో ప్రజల కోసం ఆలోచిస్తే, జనానికి ఎంతటి మేలు జరుగుతుందో నిరూపించిన అసలైన ప్రజాసేవకుడు, భారతీయుల జల ప్రధాత సర్ ఆర్థర్ కాటన్. నాటి బ్రిటీష్ ప్రభుత్వం సహకరించకపోయినా సరే, పట్టుబట్టి గోదావరి డెల్టాలో ప్రతి ఎకరాకు సాగునీరు చేరేందుకు అనువుగా కాలువలను నిర్మించారు. 1861లో కాటన్ బ్రిటీష్ ప్రభుత్వం దగ్గర సర్ అనే బిరుదును పొందారు.
ఇప్పటి గోదావరి తీరం ఇంతటి పచ్చటి మాగాణంగా కళకళలాడుతోందీ అంటే దానికి కారణం సర్ ఆర్థర్ కాటన్. అందుకే గోదావరి డెల్టా ప్రజలు నేటికీ గోదావరి పుణ్య స్నానం. ఆచరించేటప్పుడు కాటన్ దొర ను తలచుకొని ప్రణామాలు అర్పిస్తారు. ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేసేవారిని తరతరాలు తలచుకొంటాయని చెప్పడానికి కాటన్ జీవితమే తార్కాణం. గోదావరి డెల్టాలోనే కాదు కృష్ణా, తుంగభద్ర తీరాల్లోనూ కాటన్ చేసిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పుడు కూడా జల వనరుల ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణ విషయంలో పాలకులు, అధికారులు, ఇంజినీర్లు సర్ ఆర్థర్ కాటన్ స్ఫూర్తిని అందుకుంటున్నారు. నేడు ఆ జలప్రదాత జయంతి సందర్భంగా ప్రముఖ రాజకీయ వేత్తలు, సెలబ్రిటీలు ఆ మహనీయుని స్మృతికి నివాళులు అర్పించారు.