భారత్ సమాచార్, రాజకీయం : దేశ యువ ఐఏఎస్ ల్లో స్మిత సబర్వాల్ క్రేజ్ మాములుగా ఉండదు. 22 ఏండ్లకే ఐఏఎస్ సర్వీస్ సాధించి తన సత్తా చాటారు. డిగ్రీ పూర్తికాగానే కలెక్టర్ పదవి సాధించడంతో అప్పట్లో ఆమె పేరు దేశమంతా మార్మోగిపోయింది. ఐఏఎస్ శిక్షణ తర్వాత ఆమెను వెంటనే తెలుగు రాష్ట్రాల క్యాడర్ అప్పగించారు. వరంగల్ లో జాయింట్ కలెక్టర్ గా, కరీంనగర్ లో కలెక్టర్ గా సుదీర్ఘ కాలం పనిచేసి అక్కడి ప్రజల అభిమానం చూరగొన్నారు.
చిన్న వయస్సులోనే అద్భుత పనితీరుతో సీఎం కేసీఆర్ దృష్టిలో పడ్డారు. ఆమెకు సీఎం ప్రత్యేక కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా అప్పగించారు. అయితే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అందరి దృష్టి ఐఏఎస్ లపై పడింది. దాదాపు అందరూ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి శుభాకాంక్షలు చెప్పారు. కేసీఆర్ కొలువులో కీలక పదవిలో పనిచేసిన స్మిత సబర్వాల్ కలువకపోవడంతో మీడియా అటెన్షన్ ఆమెపై పడింది. ఆమె కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లాలని భావిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అలాంటిదేమీ లేదని ఆమె ఖండించించారు.
ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ పై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఫైర్ కావడం సంచలనమైంది. అప్పటి ప్రభుత్వంలో చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లి.. ఇక్కడ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం ఐఏఎస్ లకు పరిపాటిగా అయ్యిందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం వీరిని కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని సూచించారు. ఏ తప్పులు చేయకపోతే ఇలా కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లడానికి ఎందుకు ప్రయత్నం చేస్తారు అని మండిపడ్డారు. దేశంలోనే హెలిక్యాప్టర్ లో వెళ్లి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించిన ఏకైక ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ అంటూ ఘాటు కామెంట్స్ చేశారు.