భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
‘రాయి’ని చూసి రత్నమనుకోకు, ‘ఐశ్వర్యం’ అంటే వేరు అని ఎనిమిది రూపాలు చూపించింది మాలక్ష్మి. ఆది లక్ష్మి, గజ లక్ష్మి, ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్య (వీర) లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యా లక్ష్మి, సంతాన లక్ష్మి అనే అష్ట లక్ష్మీ వైభవమే ఈ మానవ జీవితం.
వరలక్ష్మీ ఆరాధన ఫలిస్తేనే మనం కోరుకున్న వరాలు దక్కుతాయి. తన కుటుంబం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిలాల్లని వనితలు కోరుకోవడం అత్యాశేమీ కాదు. ఇంటి ఇల్లాలు వరలక్ష్మీమాతను నిష్టతో పూజిస్తే వరాలు దక్కి అన్ని అవసరాలూ తీరుతాయి. వరలక్ష్మి అవతారాలు అనేకం.
ఆమెను ‘అష్టలక్ష్మీ స్వరూపం’గా ఆరాధిస్తే అన్ని వరాలూ దక్కుతాయి. ధన, ధాన్య, ధైర్య, సిద్ధి, శౌర్య, విద్య, సంతానం, ఆరోగ్యం వంటి వరాలు లక్ష్మీకృప వల్లనే మనకు సంప్రాప్తిస్తాయి. ఇవన్నీ పొందాలంటే ఒక్క వరలక్ష్మీ మాతకు అర్చన చేస్తే సరిపోతుంది. అందుకే లక్ష్మీతత్వాన్ని అనునిత్యం మననం చేసుకుంటే వరాలు సిద్ధించి, జీవితాన్ని సుఖమయం చేసుకోవడం, జన్మకు సార్థకత సాధించడం వీలవుతుంది.
పురాణ ప్రాశస్త్యం..
వరలక్ష్మీ వ్రతానికి సంబంధించి మన పురాణాల్లో ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. జగన్మాత అయిన పార్వతీదేవి ఓ సందర్భంలో తన భర్త సాంబశివుడిని ప్రశ్నిస్తూ, ‘స్త్రీలు సర్వ సుఖాలు పొంది, పుత్రపౌత్రాభివృద్ధి సాధించాలంటే ఎలాంటి వ్రతం ఆచరించాలో చెప్పాల’ని కోరుతుంది. అందుకు పరమేశ్వరుడు- ‘వనితలకు సకల శుభాలు దక్కాలంటే ‘వరలక్ష్మీ వ్రతం’ పేరిట శ్రావణ శుక్రవారం రోజున నోము నోచాలం’టూ సమాధానమిచ్చాడు.
ఈ వ్రతానికి సంబంధించి ఓ కథ బహుళ ప్రచారంలో ఉంది. పూర్వం మగధ రాజ్యంలోని కుండినము అనే గ్రామంలో చారుమతి అనే బ్రాహ్మణ యువతి ఉండేది. భర్త, కుటుంబం మేలు కోసం ఆమె నిత్యం ఎంతో తపన చెందేది. రోజూ ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే భర్త పాదాలకు నమస్కరించి, అత్తమామలను సేవిస్తూ, మితంగా మాట్లాడుతూ భగవంతుడి స్మరణతో ఆమె కాలం గడిపేది.
ఓ రోజు చారుమతి కలలో- లక్ష్మీమాత ప్ర త్యక్షమై, అనుకున్న ఆశలన్నీ ఫలించాలంటే వరలక్ష్మీదేవిని ఆరాధించమని చెబుతుంది. లక్ష్మీదేవి చెప్పినట్లే శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు- శుక్రవారం రోజున ఉపవాసం ఉండి వరలక్ష్మిని పూజించిన చారుమతి మంచి ఫలితాలను పొందుతుంది.
చారుమతి తన కలలో లక్ష్మీదేవి కనిపించగా చెప్పిన విషయాలను మిగతా మహిళలందరికీ వివరించి వారిచేత కూడా వ్రతాన్ని ఆచరింపజేస్తుంది. ఈ వ్రతం చేసిన వారందరూ చారుమతిని వేనోళ్ల కొనియాడతారు. మహాశివుడు పార్వతికి ఉపదేశించిన ఈ కథను ఆ తర్వాత సూతమహాముని శౌనకాది మహర్షులకు చెప్పడంతో విశేష ప్రాచుర్యం పొందింది.