భారత్ సమాచార్, ఆధ్యాత్మికం ;
5250 సంవత్సరాల ముందు… కారుమబ్బులు కమ్ముకునే వర్షఋతువులో శ్రావణమాస బహుళ ఆష్టమి వేళ రాత్రి 12 గంటల సమయంలో దేవకీవసుదేవుల అష్టమ 8 సంతానంగా మధురలో కారాగారంలో అవతరించారు శ్రీ కృష్ణ పరమాత్మ. ద్వాపరయుగాంతంలో ఈ భూమి పైన నడయాడిన యుగ పురుషుడు శ్రీ కృష్ణుడు. కృష్ణుడి జీవితమే ఒక సందేశం. నారయణుడు, నారాయణి(పార్వతీ దేవి) అన్నాచెళ్లెలు. ఇద్దరు ఎప్పుడూ కలిసే జన్మిస్తారు. కృష్ణుడు ఇక్కడ మధురలో దేవకివసుదేవులకు జన్మిస్తే, పార్వతీదేవి యోగమాయగా యశోదా నందులకు అదే సమయంలో జన్మించింది. తాత్వికంగా అర్థం చేసుకుంటే మధుర అంటే మంచి ఆలోచనలున్న మనసు. అటువంటి మంచి, పవిత్ర ఆలోచనలున్న మనసులు కలవారికి మాత్రమే పరమాత్మ దర్శనమిస్తాడని అర్థం. ఆయన పుట్టగానే వసుదేవుడి కాళ్ళకు, చేతులకున్న సంకెళ్ళు తెగిపొయాయి. పరమాత్మ దర్శనం కలిగితే కర్మబంధాలు వాటంతట అవే తొలగిపోతాయని చెప్తుంది ఈ సంఘటన. కంసుడి కోటలో ఉన్న అందరిని మాయ కమ్మి స్పృహ కోల్పోయారు.
ఆయన్ను వసుదేవుడు యమున దాటించి రేపల్లెకు చేర్చాలి, కాని యమున ఉధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహం ఆగదు.ఆగకూడదు. అందులోనా యమున యముడి చెల్లెలు.యముడు కాలానికి సంకేతం.యమున కూడా అంతే. అటువంటి యమున, వసుదేవుడు పసి కందైన శ్రీ కృష్ణునితో పాటు దాటడానికి మార్గం ఇచ్చింది, తన ప్రవహాన్ని ఆపివేసింది, అంటే కాలం కూడా ఆ పరమాత్మకు లోబడి ఉంటుందని,ఆయన కనుసన్నల్లో కాలం కూడా ఉంటుందని అర్దం చేసుకోవాలి. అంతేకాదు, నదిని సంసారానికి సంకేతంగా భావిస్తే, ఎవరు తమ నిత్య జీవితంలో పరమాత్ముడిని గుండేల్లో పెట్టుకుంటారో, వారు ఈ సంసారమనే మహాప్రవాహాన్ని సులువుగా దాటగలరని అర్దం. భగవంతుని నమ్మకుని ముందుకు నడిచేవారి జీవితం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగిపోతుందని చెప్తుందీ ఘటన. కృష్ణుడు రేపల్లెకు చేరాడు. రేపల్లేలో జనం అమాయకులు, భగవద్భక్తి కలవారు, శాంతస్వభావులు. ఎక్కడ ప్రజలు ధర్మ మార్గంలో జీవిస్తూ పరోపకార బుద్ధితో బ్రతుకుంతుంటారో అక్కడికి పరమాత్మ తానే వెళతాడని అందులో అంతరార్ధం. ఈ విధంగా కృష్ణకధలో ప్రతి సంఘటనలో ఎంతో తత్వం దాగి ఉంది.
కృష్ణాష్టమి ఒక్క కృష్ణునికే కాక కృష్ణుడు పుట్టి పెరిగిన గోకులం అంతటికీ పుట్టిన రోజుగా పిలువబడుతుంది. ఎందుకంటే కృష్ణావతారం పూర్ణావతారం. మిగిలిన అవతారములలో శ్రీమహావిష్ణువు అంశగానే కనపడతాడు. రామావతారంలో కూడా రాముడు, ఆదిశేషుడైన లక్ష్మణుడు, శంఖ చక్రములైన భరత శతృఘ్నులతో కలిసి తనకు తాను మానవునిగా కనపడతాడు. కృష్ణావతార౦ పూర్ణావతారంలో చిన్నతనం నుంచి నేనే భగవంతుడిని, ధర్మాన్ని బోధించడానికి ఈ అవతారంలో వచ్చాను అని చెప్పాడు. భగవద్గీతలో మనం ఒకటి గమనించవచ్చు. అర్జున ఉవాచ, సంజయ ఉవాచ, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉండి కృష్ణ ఉవాచకు బదులుగా భగవానువాచ అని ఉంటుంది. దీనిని బట్టి మహా విష్ణు పరిపూర్ణావతారంగా కృష్ణావతారాన్ని చెప్పవచ్చు. నేటి రోజులలో కూడా శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారిని పరమాచార్య, పెరియవా, నడిచే దేవుడు, అని అంటారు తప్ప ఆ పేరుతో చెప్పరు. అది మనం ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవమును తెలియచేస్తుంది. వైష్ణవులు ఈ కృష్ణాష్టమిని లక్ష్మితో కూడినదిగా జరుపుకుంటారు. మధుర కారాగృహములో కృష్ణుడు జన్మించాడు. ద్వారకలోని గోకులంలో నందుని ఇంట పెరిగి ద్వాదశ జ్యోతిర్లి౦గమైన సోమనాధకు దగ్గరలోని ప్రతాప్ ఘర్ లో ముక్తిని పొందాడు. పూతన, శకటాసుర, వంటి రాక్షసులను సంహరించి, పదునాలుగు భువనములను, తనను, ఆమెను తన నోట తల్లియైన యశోదకు చూపి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు. బ్రహ్మదేవుడు గోవులను బంధించిన సమయంలో ఆయా లేగ దూడల, గోప బాలుర ఆకారాలు తానే ధరించి అన్నీ తానె అయి ఆ లీలా గోపాల బాలుడు తమ గోకులానికి తిరిగి బయలు దేరాడు. తన విశ్వరూపాన్ని పలు సందర్భాలలో చూపినప్పటికీ, ప్రత్యేకించి అర్జునునకు కురుక్షేత్ర సంగ్రామంలో చూపి భగవద్గీతను జగతికి అందించిన మహానుభావుడు శ్రీకృష్ణుడు.