భారత్ సమాచార్.నెట్, కొలంబో: భారత్ (India), శ్రీలంక (Srilanka) మధ్య మత్స్యకారుల (Fishermen) విషయంలో తరచుగా గొడవలు జరుగుతుంటాయి. తమ జలాల్లోకి వచ్చారని భారత జాలర్లను శ్రీలంక నౌకదళ సిబ్బంది అరెస్టు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే శ్రీలంక పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ (PM Modi).. రెండు దేశల మధ్య మత్స్యకారుల వివాదాలకు మానవతా దృక్పథంతో పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలోనే తాజాగా భారత్‌కు చెందిన 14 మంది జాలర్లను శ్రీలంక విడుదల చేసింది (Srilanka Releases Fishermen). ఈ అంశంపై ప్రధాని మోదీ చర్చించిన కొన్ని గంటలకే వారిని విడుదల చేయడం విశేషం.
శ్రీలంక పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే (Anura Kumara Dissanayake)తో ప్రధాని మోదీ (Modi) సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే యూఏఈతో కలిసి ట్రింకోమలీని ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడం, పవర్‌గ్రిడ్ ద్వారా అనుసంధానత వంటి ఒప్పందాలు చేసుకున్నారు. అలాగే శ్రీలంక నిర్బంధంలో ఉన్న భారత మత్స్యకారుల్ని.. వారి పడవలను విడుదల చేయాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమంల్లో పాల్గొన్న ప్రధాని తర్వాత భారత్‌కు బయలుదేరారు. శ్రీలంక పర్యటన ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తోందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇకపోతే శ్రీలంక నుంచి తిరుగు ప్రయాణంలో ప్రధాని మోదీ విమానంలో నుంచే రామసేతు (Ram Setu)ను సందర్శించారు. ఎక్స్‌లో దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు. ” శ్రీలంక నుంచి వస్తుండగా రామసేతును దర్శించే భాగ్యం కలిగింది. అయోధ్యలో బాలరాముడి (Ayodhya Shri Ram)కి సూర్య తిలకం (Surya Tilak) జరిగినప్పుడే ఇది జరగడం విశేషం. ఈ రెండింటిని చూసే అదృష్టం నాకు దక్కిందని” ప్రధాని మోదీ రాసుకొచ్చారు.