భారత్ సమాచార్.నెట్,భద్రాచలం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం (Bhadrachalam) శ్రీరాములోరి ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు (Sri Rama Navami Celebrations) ఘనంగా జరిగాయి. మిథిలా స్టేడియంలోని మిథిలా మండపంలో వేద మంత్రోచ్ఛరణలు, రామ భక్తుల జయజయ ధ్వనాల మధ్య అభిజిత్ లగ్నంలో సరిగ్గా మధ్యాహ్నం 12.13 గంటలకు భద్రాద్రి సీతారాముల కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. సీతారాముల కళ్యాణం (Sitarama Kalyanam) తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం అంతా రామ నామస్మరణతో మార్మోగింది.
ఉదయం 9 గంటలకు కళ్యాణ క్రతువు ప్రారంభం కాగా, 10 గంటల సమయంలో సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా మిథిలా కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. కల్యాణ ముహూర్త సమయం 12.02 నిమిషాలకు వేద పండితులు వేద మంత్రాల నడుమ జీలకర్ర బెల్లంను అద్దారు. ఆ తరువాత మాంగల్యధారణ మహోత్సవం కన్నుల పండుగలా జరిగింది. ఇకపోతే రాములోరి కళ్యాణం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. సీఎం హోదాలో తొలిసారిగా రేవంత్ రెడ్డి భద్రాచలం రామయ్య ఆలయానికి వచ్చారు.
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణ వేడుకలో డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క దంపతులు, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, తుమ్మల నాగేశ్వరరావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, సీఎస్ శాంతి కుమారి, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. కాగా, శ్రీరాముని కళ్యాణానికి హాజరైన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు అన్నదానం, తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.