భారత్ సమాచార్, హైదరాబాద్ ;
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరో దారుణ సంఘటన చోటుచేసుకుంది. పేరుకేమో అంతర్జాతీయ ప్రమాణాలు, సకల సౌకర్యాలు గల విశ్వనగరం.. భాగ్యనగరం. కానీ వీధి కుక్కలు తరచుగా చిన్నారులపై దాడులు చేస్తున్నా, ఆఖరికి చంపేస్తున్నా కూడా సరైన చర్యలు చేపట్టని గ్రేటర్ హైదరాబాద్. హైదరాబాద్ లో వీధి కుక్కల నియంత్రణకు అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవటంతో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో నేడు అతి దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు కన్నుమూశాడు. ఇంటి బయట ఆడుకుం టున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు.. కొంతదూరం ఈడ్చుకెళ్లి మరీ దాడికి తెగబడ్డాయి. ఈ ఘటనలో బాలుడి మెదడులో కొంత భాగం కూడా బయటపడింది. దీంతో వళ్లంతా రక్తస్రావం, తీవ్రగాయాలైన బాలుడు మృతి చెందాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి గ్రామానికి చెందిన భరత్-లక్ష్మీ దంపతులకు విహాన్ అనే ఏడాదిన్నర కుమారుడు ఉన్నారు. ఏదైనా పని చేసుకుని బతుకుదామని నెల కిందట హైదరాబాద్‌కు పొట్టచేతపట్టుకొని వలస వచ్చారు. జవహర్‌నగర్‌లోని ఆదర్శ్ నగర్‌లో నివాసం ఉంటున్న లక్ష్మీ సోదరుడి ఇంట్లోనే ఉంటున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో విహాన్ ఇంటి ఎదుటే ఆడుకుంటున్నాడు. అప్పుడే గుంపులుగా వచ్చి న వీధికుక్కలు ఒక్కసారిగా విహాన్‌పై దాడికి తెగబడ్డాయి. చిన్నారిని దారుణంగా కొంతదూరం వరకు ఈడ్చు కెళ్లాయి. కుక్కల గుంపును చూసిన ఓ స్థానికుడు అనుమానం వచ్చి వాటి దగ్గరకు వెళ్లి చూడగా.. తీవ్రగాయాలతో పడివున్న విహాన్ అతనికి కనిపించాడు. ఒళ్లంతా కుక్కగాట్లతో రక్తం కారుతూ ఉంది. ఆ ప్రాంతం లోనే విహాన్ మెదడులో కొంత భాగం కూడా బయటకు రావటం అతడిని షాక్ కు గురిచేసింది. దీంతో వెంటనే కుక్కలను తరిమికొట్టిన స్థానికుడు.. బాలుడి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చాడు.
వెంటనే విహాన్‌ను స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రి లోని ఎమర్జెనీ విభాగానికి తీసుకెళ్లారు. కానీ కుక్కలు విపరీతంగా దాడి చేయటం వలన శరీరమంతా రక్తస్రావం అయిపోయింది. పరిస్థితి విషమించింది. దీంతో రాత్రి 9.30 గంటల ప్రాంతంలో విహాన్ మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. కుక్కల దాడిలో విహాన్ మరణించడంతో భాగ్యనగరం మరో సారి ఉలిక్కి పడింది. ఇంతకు ముందు జవహర్‌నగర్‌లో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని.. ఎన్నిసార్లు ఫిర్యా దు చేసినా అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాలుడి మృతి పట్ల సీఎం విచారం..చర్యలకు ఆదేశం
హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో వీధి కుక్కలు దాడి చేసి రెండేళ్ల బాలుడిని చంపేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలుమార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పసి కందులు, చిన్నారులపై ప్రతి ఏటా వీధి కుక్కల దాడులకు వాతావరణ పరిస్థితులా, లేక సీజనల్ కారణాల అనే అంశంపై అధ్యయనానికి పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు. వీధి కుక్కలకు టీకాలు వేయటం, లేదా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల్లో కుక్కలు దాడులు చేస్తే తక్షణం అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని వైద్యా రోగ్య శాఖను సీఎం ఆదేశించారు. ఇలాంటి సంఘటనలను నివారించడానికి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, అన్ని బస్తీలు, కాలనీలు, సంబంధిత వార్డు కమిటీల సహకారం తీసుకోవాలని జీహెచ్ఎంసీ, మున్సిపల్ అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.