భారత్ సమాచార్, నిర్మల్: దేశంలో ప్రచ్చన్న నిరుద్యోగిత రోజురోజుకు తీవ్రంగా పెరుగుతుంది. ఒక్క ఉద్యోగానికి వందలాది మంది యువతీ యువకులు పోటీ పడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం నిరంతరం కష్టపడే వాళ్లు కొందరైతే, మరోవైపు తమ క్లాస్‌లో ఎక్కువ మార్కులు సాధించి టాపర్‌గా నిలవాలని తపన మరికొందరిది. ఇక కళాశాలలో ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులు చేసే ఒత్తిడితో యువతీ యువకులు ఆత్మనూన్యతా భావంతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోటు యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో మరో విద్య కుసుమం నేలరాలడం కలకలం రేపుతోంది. హాస్టల్ గదిలో విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్రంలో సంచలనం సృష్టించింది.
అధ్యాపకుల ఒత్తిడితో ఆత్మహత్య:
సిద్దిపేట జిల్లా తోగుట మండలం బండారుపల్లికి చెందిన బుచ్చుక అరవింద్ నిర్మల్ ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో పీయూసీ 2వ సంవత్సరం విద్యనభ్యసిస్తున్నాడు. బాలుర హాస్టల్-1లోని ఓ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన తోటి విద్యార్థులు యూనివర్సిటీ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే యూనివర్సిటీ సిబ్బంది విద్యార్ధిని కిందకి దించి స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి తల్లిదండ్రులకు యూనివర్సిటీ అధికారులు సమాచారం అందించారు. ఈనెల 18 నుంచి పీయూసీ-2 విద్యార్థులకు ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. విద్యార్థి 40% హాజరు శాతం ఉందని యూనివర్సిటీ అధికారులు తెలిపారు. దీంతో ఒత్తిడికి గురై విద్యార్థి మృతి చెందాడనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థి మృతి పై యూనివర్సిటీ ఇంఛార్జ్ వైస్ ఛాన్సర్ వెంకటరమణ సంతాపం వ్యక్తం చేశారు. నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని తరలించగా విద్యార్థి సంఘాలు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశాయి.
తరచు ఇలాంటి ఘటనలు.. దేనికి సంకేతం:
ట్రిఫుల్ ఐటీ యూనివర్సిటీ అధ్యాపకుల ఒత్తిడితోనే విద్యార్థి బుచ్చుక అరవింద్ ఆత్మహత్య చేసుకున్నాడని విద్యార్థి సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. వెంటనే బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ట్రిఫుల్ ఐటీ గేట్ వద్ద పలు సంఘాల నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బాసర ట్రిఫుల్ ఐటీ యూనివర్సిటీలో తరచు ఇలాంటి ఘటనలు జరగడం బాధకరమని, ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు నినదించారు.
ఇంట్లో ఉరేసుకుని మరో విద్యార్థిని ఆత్మహత్య:
భారత్ సమాచార్, సంగారెడ్డి: మనస్తాపంతో బీఫార్మసీ చదువుతోన్న ఓ విద్యార్ధిని ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అరూర్ గ్రామానికి చెందిన మన్నే అశోక్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి సదాశివపేట పట్టణంలోని గురునగర్ కాలనీలో నివసిస్తున్నాడు. అశోక్ పెద్ద కుమార్తె శివానీ (17) హైదరాబాద్‌లో భీఫార్మసీ చదువుతుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శివానీ ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఇంటి తలుపులు తెరచి చూడగా ఫ్యాన్‌కు విగత జీవిగా వేలాడుతూ కనిపించింది. కళ్ల ముందు ఉన్న బిడ్డ ఏం కష్టం వచ్చిందో ఇలా అర్ధాంతరంగా జీవితం ముగించిందో అర్ధంకాకా ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోధించారు.
నాపై ఎలాంటి విచారణ చేయొద్దు:
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని యువతి రాసిన సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. తనకు ఇతరులకు సహాయపడటం చాలా ఇష్టమని, తన తల్లిదండ్రుల అనుమతితో తన శరీరంలోని అవయవాలను దానం చేయాలని కోరుతున్నానని లెటర్‌లో పేర్కొంది. తాను లేకున్నా తన అవయవాల వల్ల మరో ఇద్దరు జీవిస్తారని తెలిపింది. తన చావుకు తానే కారణమని, దయచేసి ఎలాంటి విచారణ చేయొద్దని లేఖలో పేర్కొంది. శివానీ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె అవయవాలు పనికిరావని వైద్యులు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు సీఐ మహేశ్ గౌడ్ తెలిపారు.
మరిన్ని కథనాలు: