భారత్ సమాచార్, జాతీయం ; ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా వేసవి సెలవులు రానే వచ్చేశాయి. మరో రెండు నెలల పాటు పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలోనే మెలగాల్సి ఉంటుంది. మరి ఈ సెలవుల్లో పేరెంట్స్ చిన్నారులపై ఎలాంటి శ్రద్ధ చూపాలి, వారితో ఎలా నడుచుకోవాలి, వారితో ఆడుకుంటూనే వారికి ఎటువంటి విలువలు, క్రమశిక్షణ నేర్పించాలి వంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
- ఏడాదంతా చిన్నారులు పాఠశాలలోనే ఎక్కువ సమయం గడుపుతారు. వేసవి సెలవులు వచ్చాయి కదా అని మళ్లీ సమ్మర్ స్పెషల్ క్యాంప్స్ అంటూ మరో కోచింగ్ సెంటర్ కి పిల్లలను పంపేయకండీ. సమ్మర్ హాలీడేస్ ని ఎంజాయ్ చేస్తూ వారితో కొంచెం సమయం గడిపే ప్రయత్నం చేయండి.
- మీ పిల్లలతో రోజుకి కనీసం రెండు సార్లు అయిన భోజనం చేయండి. తినే సమయంలో అన్నదాతల ప్రాముఖ్యత గురించి చెప్పే ప్రయత్నం చేయండి. ఆహారాన్ని వృథా చేయోద్దని సూచించండి. ముఖ్యంగా సిటీ లో పిల్లలకు పాలు పాల ప్యాకెట్ నుంచి రావు అనే స్థాయి నుంచి చెప్పాల్సి వస్తోంది. అలాంటి పరిస్థితి మీ ఇంట్లో లేకుండా చూసుకోండి.
- తిన్న తర్వాత వారి ప్లేట్లను వారి చేతనే కడిగించండి. ఇలాంటి చిన్న చిన్న పనుల ద్వారా పిల్లలకు శ్రమ విలువ అర్థమయ్యే అవకాశం ఉంటుంది.
- మీరు వంట చేసే సమయంలో వారి సహాయం తీసుకోండి. వారికి కూరగాయలు, సలాడ్ వంటివి సిద్ధం చేయటంలో సహాయం చేయమనండి.
- అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి వెళ్లి పిల్లలతో కలిసిపోనివ్వండి. మీ పిల్లలకు వారి ప్రేమ మరియు భావోద్వేగ మద్దతు చాలా ముఖ్యం.
- కిచెన్ గార్డెన్ని రూపొందించడానికి, విత్తనాలు విత్తడానికి మీ పిల్లలను ప్రొత్సహించండి. మీ పిల్లల అభివృద్ధికి చెట్లు మరియు మొక్కల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
- మీ బాల్యం మరియు మీ కుటుంబ సభ్యుల చరిత్ర గురించి పిల్లలకు చెప్పటం మర్చిపోకండి. సంతోకరమైన విషయాలను వారితో పంచుకోండి.
- పిల్లలను బయటకు వెళ్లి ఆడనివ్వండి, వారు గాయపడనివ్వండి, మురికిగా ఉండనివ్వండి. అప్పుడప్పుడు పడిపోవడం మరియు నొప్పిని భరించడం వారికి మంచిది. సోఫా కుషన్ల వంటి సౌకర్యవంతమైన జీవితం మీ పిల్లలను సోమరిగా మారుస్తుంది.
- కుక్క, పిల్లి, పక్షి లేదా చేప వంటి ఏదైనా పెంపుడు జంతువును వాటిని పెంచుకునేందుకు ప్రొత్సహించండి.
- పిల్లలను టీవీ, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్లకు కొద్ది సమయం మాత్రమే కేటాయించేలా చూసుకోండి. చిన్న చిన్న కథల పుస్తకాలను అలవాటు చేయండి.
- వేసవి సమయం కాబట్టి వారికి చాక్లెట్లు, జెల్లీలు, క్రీమ్ కేకులు, చిప్స్, ఎరేటెడ్ డ్రింక్స్ మరియు పఫ్స్ వంటి బేకరీ ఉత్పత్తులు మరియు సమోసాలు వంటి వేయించిన ఆహారాలు ఎక్కువ ఇవ్వకుండా జాగ్రత్త పడండి. మొత్తంగా హాలిడేస్ ని హాలిడేస్ లాగే పిల్లల్ని ఎంజాయ్ చేయనివ్వండి.