భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: చాలా దేశాలు పిల్లలు సోషల్ మీడియా (Social Media) వినియోగించకుండా బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇలా బ్యాన్ చేయాలని సుప్రీంకోర్టు (Supremecourt)లో ఓ పిల్ దాఖలైంది. 13 ఏళ్లలోపు ఉండే పిల్లలు సోషల్ మీడియా ఉపయోగించకుండా నిషేధం (Ban on Social Media ) విధించాలని కోరుతూ ఇటీవల ఓ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. తాజాగా దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తోసిపుచ్చింది (Supremecourt Refuses). ఈ పిటిషన్‌ని విచారించేందుకు అత్యున్నత న్యాయస్థానం నో చెప్పింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌తో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. “ఇది విధానపరమైన విషయం. పిల్లలు సోషల్ మీడియా వాడకుండా బ్యాన్ విధించాలని మీరు పార్లమెంటును చట్టం చేయమని అడగండి. ప్రస్తుతం దాఖలు చేసిన పిటిషన్‌ను స్వీకరించలేము. దీనికి పరిష్కారం విధానపరమైన నిర్ణయం పరిధిలో ఉంది. సంబంధిత విభాగానికి మీరు ఫిర్యాదు చేసుకోవచ్చు. ఒక వేళ మీరు ఫిర్యాదు చేస్తే 8 వారాల్లోగా అధికారులు దానిని పరిష్కరించాలి” అని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ పిటిషన్‌ను జెప్ ఫౌండేషన్ దాఖలు చేసింది. సోషల్ మీడియాలో బలమైన వెరిఫికేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం.. ఇతరులకు గైడ్‌లైన్స్ ఇవ్వాలని అందులో కోరింది. దీంతో పాటు చిన్నారులకు సోషల్ మీడియా యాక్సెస్‌ను నియంత్రించాలని విజ్ఞప్తి చేసింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది మోహిని ప్రియా వాదించారు. పిల్లల భద్రత కోసం ఏర్పాటు చేసిన నిబంధనలు ఉల్లంఘించిన సోషల్ మీడియా సంస్థలకు భారీగా ఫైన్ విధించాలని పిటిషినర్లు కోరారు. కానీ అత్యున్నత న్యాయస్థానం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది.