భారత్ సమాచార్.నెట్, న్యూ ఢిల్లీ: రాష్ట్రపతి (President) పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులపై సుప్రీంకోర్టు (Supremecourt) సంచలన తీర్పును ఇచ్చింది. గవర్నర్లు పంపిన బిల్లులపై రాష్ట్రపతి మూడు నెలల్లో నిర్ణయం (Decision in 3 Months ) తీసుకోవాలని స్పష్టం చేసింది. ఏదైనా జాప్యం జరిగితే రాష్ట్రపతి భవన్ అందుకు కారణాలను రాష్ట్రాలకు వివరణ ఇవ్వాలని జస్టిస్ జేబీ పార్దీవాలా(Justice JB Pardiwala), జస్టిస్ ఆర్ మహదేవన్(Justice R. Mahadevan)లో కూడిన ధర్మాసం పేర్కొంది. నిర్దేశిత గడువులోగా రాష్ట్రపతి నుంచి స్పందన లేకపోతే.. రాష్ట్ర ప్రభుత్వాలు మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చని సుప్రీంకోర్టు సుచించింది. రాష్ట్రపతికి గడువు నిర్దేశిస్తూ అత్యున్నత న్యాయస్థానం ఈ తరహా తీర్పు ఇవ్వడం ఇదే తొలిసారి.
తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్ రవి తన వద్దే చాలా కాలంగా ఉంచుకోవడంతో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇటీవల దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ అలాగే ఉంచడం రాజ్యాంగ విరుద్ధం అని వ్యాఖ్యానించింది. ఏదైనా బిల్లును మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం ఆపాల్సి వస్తే.. అందుకు గవర్నర్ తీసుకోవాల్సిన అత్యధిక గడువు కేవలం ఒక్క నెల మాత్రమేనని పేర్కొంది. ఒకవేళ మంత్రి మండలి సలహా లేకుండా గవర్నర్ బిల్లు ఆమోదాన్ని ఆపాలనుకుంటే మూడు నెల్లలోగా అలంటి బిల్లును శాసన సభకు తిరిగి పంపించాలని సూచించింది.
అలాగే గవర్నర్ బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపినప్పుడు, రాష్ట్రపతి తిరస్కరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం కోర్టును ఆశ్రయించవచ్చని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆర్టికల్ 200 ప్రకారం, గవర్నర్‌కు బిల్లులను ఆమోదించే, నిలిపివేసే లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపే అధికారం ఉంది. అయితే, గవర్నర్ బిల్లులను ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉంచడం, సదుద్దేశంతో వ్యవహరించకపోవడం సరికాదని కోర్టు అభిప్రాయపడింది. కాగా, గవర్నర్ ఆమోదం కోసం నిలిపి ఉంచిన 10 బిల్లులకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పది చట్టాలను నోటిఫై చేసింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 చట్టాలను నోటిఫై చేయడం రాజ్యంగ చరిత్రలో ఇదే తొలిసారి.