Homebreaking updates newsమొన్న కరెంటు, నిన్న ఉద్యోగాలు, ఇయ్యాళ రైతుబంధు..

మొన్న కరెంటు, నిన్న ఉద్యోగాలు, ఇయ్యాళ రైతుబంధు..

భారత్ సమాచార్, రాజకీయం : తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇంకా రెండు రోజుల టైమే ఉంది. ప్రధాన పార్టీలు పోల్ మేనేజ్ మెంట్ పై దృష్టి సారించాయి. ఇక ప్రచార రణరంగంలో రోజుకొక అంశంపై పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. మొన్నటిదాక కరెంట్ రగడ, నిన్న ఉద్యోగ నోటిఫికేషన్లపై, ఇయ్యాళ రైతుబంధు పథకం నేతలకు అస్త్రాలుగా మారాయి. ఇంకా ప్రచార దూషణలకు, జనాల్లో మైలేజ్ పెంచుకోవడానికి రెండు రోజుల సమయమే ఉండడంతో ఏ కొత్త అంశం పార్టీల పుట్టి ముంచుతుందో తెలియక సతమతమవుతున్నాయి.

బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా ప్రచార రణరంగంలోకి దిగారు. బీఆర్ఎస్ నుంచి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి మోదీ, అమిత్ ఇతర అగ్రనేతలు ప్రచారంలో పాల్గొని క్యాడర్ లో ఉత్సాహం నింపుతున్నారు. ఈ తరుణంలో పార్టీల మ్యానిఫెస్టో అమలుపై ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య గట్టి ఫైట్ నడుస్తోంది.

కర్నాటక ఎన్నికల్లో అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చి అక్కడి ప్రజలను మోసం చేసిందని, తెలంగాణలో అంతకుమించి హామీలు ఇచ్చి ఇక్కడి జనాలను మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధమైందని, ఆ పార్టీని నమ్మొద్దని బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాము తెలంగాణలో 24గంటల కరెంట్ ఇస్తున్నామని, కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ మాత్రమే ఇస్తామని చెపుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రచారం మొదట్లో ఈ అంశంపై తెలంగాణను ఊపేసింది. తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లపై రగడ మొదలైంది. నిరుద్యోగుల దుస్థితికి బీఆర్ఎస్సే కారణమని, తాము అధికారంలోకి వస్తే 2లక్షల ఉద్యోగాలు ఏడాదిలో భర్తీ చేస్తామని కాంగ్రెస్.. యూత్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీలో నిరుద్యోగులతో మాటమంతి కూడా చేశారు. ఇక కేటీఆర్ ఫలితాల తెల్లారే అశోక్ నగర్ లో నిరుద్యోగులతో సమావేశం ఏర్పాటు చేసి వారి సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇక రెండు అంశాలపై విమర్శల పర్వం నడుస్తుండగానే రైతుబంధుకు ఈసీ క్లియరెన్స్ ఇవ్వడం, హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేస్తే.. రైతుబంధు క్లియరెన్స్ ను ఉపసంహరించుకోవడం జరిగింది.

ఇక ఈ రెండు రోజులు రైతుబంధు అంశమే ప్రధాన పార్టీలకు ముడిసరుకుగా మారనుంది. కాంగ్రెస్ ఆపితేనే రైతుబంధు ఆగిందని బీఆర్ఎస్, రైతుబంధును ఎన్నికల అవసరానికి వాడుకుంటున్నట్టుగా కాంగ్రెస్, రైతుబంధుపై ఆ రెండు పార్టీలవి నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. మొత్తానికి తెలంగాణలో ఓటరు ఎటువైపు మొగ్గుచూపుతాడో ఎవరికీ అంతుపట్టకుండా మారిపోయింది. పథకాలపై రగడ చేస్తున్న పార్టీలు, వారి స్వలాభం కోసమే ఆలోచిస్తున్నాయని, ప్రజలపై ప్రేమతో కాదని సగటు ఓటరు గుర్రుమంటున్నాడు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. తమను ఉద్దరించేది ఏదీ ఉండదని, తమ పని తాము చేసుకుంటేనే తమకు బతుకుదెరువు అని నిట్టూరుస్తున్నాడు.

మరికొన్ని రాజకీయ కథనాలు…

మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కు రైతుబంధు.. పెద్ద రైతు కాబోలు!?

RELATED ARTICLES

Most Popular

Recent Comments