భారత్ సమాచార్.నెట్, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రా (Hydra) వ్యవస్థను రేవంత్ రెడ్డి సర్కార్(Revanth Reddy Govt) తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే హైడ్రా పనితీరుపై తెలంగాణ హైకోర్టు (Telangana Highcourt) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా టార్గెట్ పేద, మధ్య తరగతి మాత్రమేనా అని హైకోర్టు ప్రశ్నించింది. హైడ్రా పక్షపాతంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం మండిపడింది. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్‌లోని పలు సర్వే నంబర్లలో ఉన్న 6.10 ఎకరాల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలంటూ స్థానిక ఎమ్మార్వో జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ.. షామ్స్ ఫాతిమాఖాన్ హైకోర్టును ఆశ్రయించారు.
తాజాగా ఈ పిటిషన్‌పై జస్టిస్ సి.వి.భాస్కర్ రెడ్డి (Justice Chada Vijaya Bhaskar) ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా హైడ్రాపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలే చేసింది. పేదలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని.. పెద్దల నిర్మాణాలను తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా? అని నిలదీసింది. అంతే కాదు ప్రముఖులకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా అని ప్రశ్నించింది హైకోర్టు. మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పేపర్లలో ఫొటోలు వేయించుకోవడం కాదని చురకలు అంటించింది. సంపన్నులు ఉండే దుర్గం చెరువు, మియాపూర్ చెరువుల్లో ఆక్రమణలనూ తొలగించాలని.. అప్పుడే ప్రజాప్రయోజనాలను పరిరక్షించినట్లవుతుందని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఒకప్పుడు హైదరాబాద్ సిటీ ఆఫ్ లేక్స్‌గా ఉండేదని.. అప్పుడు 2,200 చెరువులుంటే ప్రస్తుతం 180 కూడా లేవని జస్టిస్ భాస్కర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చెరువుల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటోందని.. కాకపోతే మురికివాడల్లోని పేదల అక్రమ నిర్మాణాలనే కాకుండా పెద్దలు చేపట్టిన అక్రమ నిర్మాణాలను కూల్చాలని సూచించింది. ఇకపోతే మీరాలం చెరువుకు సంబంధించి.. ఇరిగేషన్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ భూమి వక్ఫ్‌బోర్డుదని తేలితే ఆక్రమణల తొలగింపు బాధ్యతలను హైడ్రాకు కాకుండా వక్ఫ్‌బోర్డుకు వదిలేయాలంటూ స్పష్టం చేసింది హైకోర్టు.