భారత్ సమాచార్, హైదరాబాద్ ;
అజేయంగా, అప్రతిహాసంగా 2024 టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టు మీద ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. తాజాగా భారత్ జట్టులో పాస్ట్ బౌలర్ గా రాణించిన హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ నేడు భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో సిరాజ్ మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. భారత్ జట్టు విజయంలో బౌలర్ గా తన వంతు సత్తా చాటిన సిరాజ్ ను సీఎం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా సిరాజ్ను ఘనంగా సన్మానించారు. ఈ హైదరాబాదీ పాస్ట్ బౌలర్ కి భారత జెర్సీ ని బహుకరించారు. సిరాజ్ అద్భుతమైన ప్రతిభను కనబరిచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని గుర్తించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. బీసీసీఐ ఇప్పటికే భారత జట్టుకు రూ.125 కోట్ట నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే.