భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఇండియాలో ఏం నడుస్తోంది అంటే.. ప్రశాంత్ ల టైమ్ నడుస్తోంది భయ్యా అని చెప్పుకునే రోజులివి. ప్రశాంత్ పేరు చెబితే ఇప్పుడు ఇండియన్ సినిమాను, మీడియాను షేక్ చేస్తోంది. బుల్లితెర నుంచి వెండితెర వరకు రచ్చ చేస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘ప్రశాంత్’ ల మేనియా సాగుతోంది. గత నాలుగు నెలలుగా ప్రశాంత్ పేరు మీడియాలో విపరీతంగా నానుతోంది. బిగ్ బాస్ షోలో పల్లవి ప్రశాంత్ పేరు, ఆ తర్వాత ‘సలార్’ మూవీతో ప్రశాంత్ నీల్, ప్రస్తుతం ‘హనుమాన్’ మూవీతో ప్రశాంత్ వర్మ పేరు ఎంటర్ టైన్ మెంట్ రంగాన్ని ఊపేస్తోంది.
మొదటగా ప్రశాంత్ నీల్ పేరును తీసుకుంటే కేజీఎఫ్ రెండు సినిమాలతో దేశాన్ని షేక్ చేసిన విషయం తెలిసిందే. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ ఇండియన్ గ్రేట్ డైరెక్టర్ గా మారిపోయాడు. తాజాగా ప్రభాస్ ‘సలార్’తో ప్రశాంత్ నీల్ దుమ్మురేపాడు. సుమారు రూ.700కోట్లు వసూలు చేసింది. దీంతో ప్రశాంత్ నీల్ పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది.
ఇక ప్రశాంత్ వర్మ.. చిన్న సినిమాగా వచ్చిన హనుమాన్ పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. ఇప్పటికే రూ.200కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. రూ.30కోట్ల బడ్జెట్ తో చిన్న తారాగణంతో హాలీవుడ్ రేంజ్ లో సినిమా తీశాడని ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలతో పోటీ పడి.. వాటన్నంటినీ వెనక్కి నెట్టి పండుగ విజేతగా నిలిచింది.
ఇక మూడో ప్రశాంత్.. కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అనూహ్యంగా స్టార్ అయిపోయాడు. ఏకంగా బిగ్ బాస్ షో విజేతగా నిలిచి వార్తల్లో నిలిచాడు. రైతుబిడ్డగా అందరినీ ఆకట్టుకున్న పల్లవి ప్రశాంత్.. సినిమా,టీవీ నటులను వెనక్కి నెట్టి విజేతగా నిలువడం గ్రేట్ అనే చెప్పాలి.