Homemain slidesఏవుసం చేద్దామంటే చదువు పెద్దదాయే...

ఏవుసం చేద్దామంటే చదువు పెద్దదాయే…

భారత్ సమాచార్, జాబ్స్ అడ్డా ;  ఎన్నో ఆశలతో ఉద్యమం చేశాం
సబ్బండ వర్గాలను ఏకం చేశాం
రణనినాదమై రోడ్లపై గర్జించాం
పోలీసుల లాఠీలకు, తూటాలకు వెనక్కితగ్గలేదు
బెదిరింపులకు, కేసులకు లొంగలేదు
ఆశ, ఆశయం, శ్వాస, ధ్యాస అన్ని
తెలంగాణ రాష్ట్రం కోసమే ధారపోశాం
స్వరాష్ట్రం తెచ్చుకున్నాం కానీ
పదేళ్ల పాలనలో నిరుద్యోగులకు ఒరిగిందేంటి..?
రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పిన ప్రభుత్వం చేసిందేంటి..?

ఉద్యోగాలు రాక నిరుద్యోగులకు అరిగోస తప్పలేదు
అమ్మానాన్నల ఆశయం నెరవేరలేదు
రాష్ట్రం రాకముందు ఎట్లుండే తెలంగాణ
కొట్లాడి తెచ్చుకున్నాకా ఇప్పుడేట్లాయింది తెలంగాణ
అయ్యా అవ్వలకు మళ్లీ కారం మెతుకులే దిక్కయినయ్
సకాలంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపాయే
ప్రభుత్వ కొలువులు లేక కూలీబాట తప్పదాయే
ఏవుసం చెద్దామంటే చదువు పెద్దదాయే
తోటోళ్ల ముందు చిన్నచూపాయే
చదువు పెద్దగా చదివినా ఊర్లో విలువ లేకపాయే

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ అరిగోస ఏంది..?
పదేళ్లు అయినా నిరుద్యోగులకు ఈ అన్యాయం ఏంది..?
కొలువులు అంటే బర్లు, గొర్లేనా..?
ఉపాధి అంటే కూలీ పనేనా..?
పాలన మారదా..? నాయకత్వంలో మార్పు రాదా..?
ప్రజల్లో చైతన్యం లేదా, నిరుద్యోగుల్లో కనువిప్పు కలగదా..?
చుద్దాం చెద్దాం అంటే ఇంకెప్పుడు..?
సమయం ఆసన్నమైంది, దిక్కులు పిక్కటిల్లేలా గర్జించు
ప్రశ్నించూ, అమసర్థ, అవినీతి నాయకులను నిగ్గుతేల్చూ
రణనినాదామై నినదించు, అమరవీరుల ఆశయసాధనకు పిడికిలి బిగించు
అన్ని వర్గాలను ఏకం చేయ్
ఆత్మస్థైర్యంతో ముందడుగు వేయ్
ఓటు హక్కుతోనే కసితీరా గుణపాఠం చెప్పు
నిన్ను నువ్వుగా నిరూపించుకో
ఓటుతోనే మార్పు సాధ్యమని గుర్తించుకో
సమసమాజ నిర్మాణం కోసం ప్రయత్నించు
ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది
ఆత్మసమీక్ష చేసుకోవాల్సిన సమయం రానే వచ్చింది
గత ఎన్నికల్లో చేసిన తప్పే మళ్లీ చెయ్యకు
మేలుకో నీ ఓటుతో సరైన నాయకుణ్ణి ఎన్నుకో.

60ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎంతో మంది అమరవీరుల త్యాగం, ఎన్నో ఉద్యమాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అప్పులకుప్పగా మారింది. రాష్ట్రం సాధించాం కానీ రాష్ట్ర సాధనకు పునాదిగా రాళ్లుగా ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్‌లైన్‌తో ఉద్యమించి తెచ్చుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగాలు సకాలంలో వేయకపోవడంతో ఎంతోమంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్వార్థ రాజకీయాల కోసం నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ సర్కార్ చెలగాటమాడింది, పదేళ్లు అయినా ఏ ఒక్క నోటిఫికేషన్‌ను సక్రమంగా నిర్వహించి పూర్తి స్థాయిలో నియామకాలు చేపట్టలేదు. సకాలంలో నియామకాలు చేపట్టకపోగా TSPSC పేపర్ లీకేజీ వ్యవహారంతో ఎంతోమంది నిరుద్యోగుల జీవితాలను రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేసింది. స్వరాష్ట్రం వస్తే లక్షల కొలువులు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసిందని, నిండా ముంచిందని నిరుద్యోగులు రగిలిపోతున్నారు.

ధనిక రాష్ట్రంలో నిరుద్యోగులే అధికం
తెలంగాణ రాష్ట్రం వస్తే బతుకులు మారుతాయనుకుంటే బీఆర్ఎస్ పాలనలో ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగిత రేటు తీవ్రంగా పెరిగిపోయింది. తెలంగాణలో నిరుద్యోగ రేటు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా 2022 గణాంకాల ప్రకారం తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 34 శాతంగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే రాష్ట్రంలో నిరుద్యోగ సగటు 2.2 శాతం పెరిగింది. గత ఏడాది జనవరి నాటికి 7.7 శాతం ఉన్న నిరుద్యోగ రేటు క్రమక్రమంగా పెరిగి 9.9శాతం నమోదైంది. జాతీయ స్థాయి నిరుద్యోగ సగటు రేటు 7.2శాతం ఉండగా, తెలంగాణలో 9.9శాతంకు పెరగడంతో జాతీయ నిరుద్యోగ సగటు కంటే 2.7శాతం రాష్ట్రంలో ఎక్కవగా ఉండడం గమనార్హం. రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగ రేటు గణనీయంగా పెరిగినట్లు పలు అధ్యయనాల్లో స్పష్టమైంది.

అప్పుచేసి చదుకుంటే..కూలీ పనే దిక్కయింది
డిగ్రీలు, పీజీలు చదువుకుని ఉద్యోగం సాధించి అమ్మానాన్నల ఆశయాలను సాధిస్తామనుకుంటే అప్పులు చేసి కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి రాత్రనకా పగలనకా చదువుకుంటే నోటిఫికేషన్లు రాకపోవడంతో అటు డబ్బులు, ఇటు టైమ్ వృథా అయిందని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలో గంజో తాగి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ నిద్రహారాలు మాని కొలువు కోసం పట్టుదలతో శ్రమిస్తే పేపర్లు లీకేజీ కావడంతో ఇక మాకు భరోసా లేదని, ఉద్యోగ క్యాలెండర్ రాదని నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. డిగ్రీలు, పీజీలు చేసి అటు ఇంటికి వెళ్లలేక, బంధువుల ముందు తలెత్తుకోలేక, స్నేహితుల వద్ద తలదాచుకుని బ్రతకాల్సిన పరిస్థితి నెలకుందని తీవ్ర ఆందోళనలో నిరుద్యోగులు ఉన్నారనేది నిష్టూర సత్యం. రాష్ట్రంలో సుమారు 50లక్షలపైన ఉన్న నిరుద్యోగులు ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాల కోసం అన్వేషిస్తుండడం గమనార్హం. ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం కాదా..?, పాలకుల విధివిధానాల లోపం కాదా, స్వార్థరాజకీయాల కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నది ఎవరు. ఒక్కసారి యువత ఆలోచించాలి, ఆత్మసమీక్ష చేసుకోవాలి, ఓటు అనే ఆయుధంతో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి.

సమయం వచ్చింది..కసితీరా గుణపాణం చెప్పు

వాస్తవానికి మనం రాజకీయం చేయకపోయినా, సాధారణంగా ఏ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనకపోయినా మనల్ని రాజకీయం ఏదోరకంగా ప్రభావితం చేస్తూనే ఉంటుంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.3016 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిన బీఆర్ఎస్ సర్కార్, ఆ హామీని అమలు చేయకపోగా ఉన్న ఖాళీలను భర్తీ చేయలేదు. రాష్ట్రం వస్తే తమ భవిష్యత్తు మారుతుందని ఎన్నో కలలు కన్న యువతకు రాష్ట్రం వచ్చి దాదాపు పదేళ్లు అయినా నిరాశే మిగిలింది. ఉద్యోగాలు లేక ఉపాధి కోసం నానా ఇబ్బందులు పడాల్సి వస్తుందని నిరుద్యోగులు తీవ్ర నైరాష్యంలో మగ్గుతున్నారు. దీనికి కారణాలు ఏవైనా, ఎవరైనా నిరుద్యోగులకంటూ ఒక అవకాశం వచ్చింది. అది ఏంటంటే ఓటు హక్కు. ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఓటుకు ఎంతో విలువ ఉంది. ఓటు వజ్రాయుధంగా చెప్పుకునే మనం ఎంత వరకు సద్వినియోగం చేసుకుంటున్నాం, ఏ మేరకు సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటున్నాం అనేది ప్రస్తుతం మనం ఆలోచించాల్సిన విషయం. హామీల అమలులో విఫలమైన ప్రభుత్వానికి ఓటుతో గుణపాఠం చెపుదాం, అవినీతి, అసమర్థ నాయకుడికి ఓటుతోనే బుద్దిచెపుదాం, లే మిత్రమా, మేల్కో నేస్తమా, తోటి మిత్రులను మేలుకోల్పు, పాలకులు ఒల్లు దగ్గరు పెట్టుకుని పనులు చేసేటట్టు ఓటుతో సమాధానం చెప్పు. ఇప్పుడు కనువిప్పు కాకపోతే మళ్లీ ఐదేళ్ల వరకు ఇలానే సాగుతుంది, పాలన పడకేస్తోంది, సమర్థవంతమైన పాలన చూడాలేం, అభివృద్ధిని పొందలేం, అనుకున్న ప్రభుత్వ ఫలాలను దక్కించుకోలేం, ఉద్యోగాలు సాధించలేం, అందుకే యువత ఆలోచించు, గతంలో చేసిన తప్పును మళ్లీ చేయ్యకు, మేలుకో నీ ఓటుతో సరైన నాయకుణ్ణి ఎన్నుకో.


RELATED ARTICLES

Most Popular

Recent Comments