భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి: ఆరుగాలం శ్రమించి వేసిన పంటకు లాభం వస్తుందన్న ఆశ లేదు, వ్యవసాయ బావుల దగ్గర మోటర్లకు, షాటర్లకు రక్షణ లేదు. ఒకవైపు వచ్చిపోయే కరెంట్‌తో ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు ఆశించినంత పంట చేతికి వస్తదో రాదోనన్న భయాందోళన సతమతం అవుతున్నారు అన్నదాతలు. ఇక అప్పు చేసి పెట్టుబడి పెట్టిన పంట చేతికి అందకముందే దానికి వడ్డీలు కట్టలేక అన్నదాతలు చెప్పలేనన్ని అవస్థలు పడుతున్నారు.
ఈ నేపథ్యంలో వ్యవసాయ బావుల దగ్గర తరచుగా కేబుల్ వైర్లు చోరీకి గురవుతుండడంతో రైతన్నలు కంటతడి పెడుతున్నారు. బీబీనగర్ మండలం రావిపహాడ్ గ్రామంలోని రైతుల బావుల వద్ద కేబుల్ వైర్ల చోరీ ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. శనివారం రాత్రి గ్రామంలోని సుమారు 10 మంది రైతుల బావుల వద్ద కేబుల్ వైర్లు దొంగతనం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున పొలాలకి వెళ్లిన అన్నదాతలు కేబుల్ వైర్లు మాయం అవ్వడంతో రైతన్నలు కంగుతున్నారు. వెంటనే చోరీ చేస్తున్న వారిని పట్టుకుని శిక్షించాలని ఆవేదనతో డిమాండ్ చేశారు. ఇప్పటికే గత మూడు నెలల్లో వ్యవసాయ బావుల వద్ద మూడుసార్లు కేబుల్ వైర్లు చోరీకి గురవడం గమనార్హం. ఈ విషయమై గ్రామస్తులు అంతా కలిసి ఒక సారి పోలీసు స్టేషన్ కి వెళ్లి అధికారికంగా తమ ఫిర్యాదును కూడా అందించారు. పంట బావుల దగ్గర కేబుల్ వైర్లు చోరీ అవ్వకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సరైన సమయంలో వానలు కురవక, సరైన పంట దిగుబడి లేక అల్లాడిపోతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని అన్నదాతలు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.