భారత్ సమాచార్.నెట్, కడప: ఏపీ (Andhra Pradesh)లోని కడప (Kadapa) జిల్లా పరిధిలోని ఒంటిమిట్ట (Vontimitta) శ్రీకోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 11న శుక్రవారం సాయంత్రం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు శ్రీ సీతారాముల కళ్యాణం (Sitaramula Kalyanam) జరగనుంది. స్వామివారి కళ్యాణోత్సవానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సీఎం చంద్రబాబు దంపతులు స్వామివారి కళ్యాణం రోజు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. ఇక ఈ కళ్యాణం చూసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీకోదండరామ స్వామి కళ్యాణానికి హాజరై భక్తుల కోసం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్– 2లో శ్రీవారి సేవకుల సహకారంతో లడ్డూలను ప్యాక్ చేయించింది టీటీడీ. డిప్యూటీ ఈవో శివప్రసాద్, ఏఈవో బాలరాజు ఆధ్వర్యంలో దాదాపు 300 మంది తిరుమలలో శ్రీవారి సేవకులు 70 వేల లడ్డూలను ప్యాకింగ్ చేశారు. సీతారాముల కళ్యాణంలో పాల్గొనే భక్తులకు ఈ లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నారు.
ఇకపోతే ఒంటిమిట్టలో ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజున వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమై.. చైత్ర పౌర్ణమి రోజున సీతారాముల కళ్యాణం జరుగుతోంది. ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం పున్నమి కాంతుల్లో జరగడం ఆనవాయితీ. అయితే ఒంటిమిట్టలో శ్రీరామనవమి రోజున కాకుండా… చైత్ర పౌర్ణమి రోజు రాములోరి కళ్యాణం నిర్వహించడం వెనక కొన్ని కథనాలు ఉన్నాయి. అందులో ఒకటి.. పగటిసమయంలో తాను కళ్యాణం చూడలేకపోతున్ననని చంద్రుడు బాధపడటంతో శ్రీరామచంద్రుడు ఇచ్చిన మాట ప్రకారం.. ఒంటిమిట్ట ఆలయంలో నిండు పౌర్ణమి రోజు కళ్యాణం జరుగుతుంది. మరో కథనం ప్రకారం.. చంద్రవంశానికి చెందిన విజయనగరరాజులు తమ కులదైవం కోసం రాత్రివేళ కళ్యాణం జరిపించే ఆచారం ప్రారంభించారని చెబుతుంటారు. కారణాలు ఏమైనా ఇతర వైష్ణవ ఆలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణం వేడుక పున్నమి కాంతుల్లో జరగడం ప్రత్యేకం.