Homemain slidesఅటుకులు నచ్చని నేటి శ్రీకృష్ణుడి కథ...

అటుకులు నచ్చని నేటి శ్రీకృష్ణుడి కథ…

భారత్ సమాచార్ ;

1993వ సంవత్సరం, మండుతున్న వేసవి కాలం…సమాచార్ న్యూస్ పేపర్ మూడో పేజీలో ఒక క్రైమ్ వార్త…‘ఒక గొప్ప స్నేహితుడి గురించి ఎప్పుడూ పురాణాల్లో వినడం, పుస్తకాల్లో చదవటం తప్ప, నేను మాట్లాడింది లేదు, కలిసింది లేదు, అందుకే నేను దొంగగా మారిన’ అంటూ న్యూఢిల్లో దొంగతనాలు చేస్తూ పోలీసులకి పట్టుబడిన అన్వార్ పాషా చెప్పిన మాటలు, పల్లెటూరిలో ఉన్న రాము ఆ వార్తను చదువుతూ, పిచ్చిగా నవ్వుకుంటున్నాడు. ఆ నవ్వులో కొంచెం బాధ, ఇంకొంచెం కష్టం మరికొన్ని జ్ఞాపకాలు మెదులుతున్నాయి.సావిట్లో ఉన్న తన పందుల అరుపులకు చేతిలో ఉన్న పేపర్ ను పక్కకి విసిరేసి టైం అవుతున్నట్లు దొడ్డిలో ఉన్న పందులని మేతకోసం తోల్కొని వెళ్ళుతున్నాడు. దారిలో వెళుతూ ఎదో ఆలోచిస్తున్నాడు.

మూడో పేజీలో వచ్చిన దొంగతనం కేసు కంటే కూడా మొదటి పేజీలో వచ్చిన ఇంకో వార్త ఇంకా బాధని పెంచుతోంది. ‘‘అతి చిన్న వయసులోనే చాలా డబ్బు సంపాదించిన అతి సామాన్యుడిని నేను’’అంటూ ప్రముఖ ధనవంతుడు గోషాల్ గురించిన వార్త. అందులో గోషాల్ ‘‘ప్రపంచంలో ఎవ్వరూ, ఎవరకి సహాయం చేయరు సొంతంగా ఎదగాలి, నా సొంత కష్టం మాత్రమే నమ్ముకొని నేను ఈరోజు గెలిచా’ ఆ మాటలు రాముకి బాగా గుర్తుకు వస్తున్నాయి.

రోజు పందులతో సరదాగా జీవనం సాగించేస్తున్నాడు. ఎందుకో ఈరోజు పందులు కూడా చాలా నెమ్మదిగా నడుస్తున్నాయి. అరిస్తే తన యజమాని కొడతాడు అనుకున్నాయి ఏమో, ఎలాంటి అరుపులు చేయకుండా ఉన్నాయి. ఈ రోజు గడవడం చాలా కష్టంగా మారుతోంది. నడి నెత్తిమీద సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. మళ్లీ అదే ఆలోచనలో పడిపోయాడు రాము. ఒకడు ఏమో ‘‘సొంతగా ఎవరు గెలవలేరు’’ అనంటే మరొకడేమో ‘‘నీకు ఎవరు సహాయం చేయరు’’ అని అంటాడు, ఆ ఇద్దరి గురించి బాగా తెలిసిన రాముకి మాత్రం తన చిన్ననాటి జ్ఞాపకాలు కళ్లముందు కనిపిస్తున్నాయి.

ఒక్కరిని కలవాలంటే బిడియం, ఎవరితో ఐన మాట్లాడాలంటే భయం, ఒంటరిగా ఉండటం, ఊరిలో ఎవరైనా చనిపోతే వాళ్ళని దగ్గర చూడటం. అప్పుడు తనకి తానుగా మనసులో అనుకోవటం. నేను కానీ చనిపోతే కనీసం ఒక లక్షమంది ఐన తన చావు చూసి ఏడవాలి అనుకోవటం. అలాంటి కోరికని సాకారం చేసుకోటానికి , 22 ఏళ్లు విశ్వప్రయత్నం చేశాడు. చివరకి సాధించలేక ఒక పనికిరాని వాడిలా ఉండిపోయాడు. లక్ష మంది ఏడుపులు రోజు వాడే ఏడుస్తున్నాడు, అటూ చావలేక, ఇటూ బ్రతకలేక జీవిస్తున్న జీవితం రాముది. అలాంటి బ్రతుకునే కొన్ని సంవత్సరాల నుంచి మోయలేక మోస్తున్నాడు.ఒక దొంగకి రాము ఒక స్నేహితుడు, ఒక గొప్పవాడికి కూడా రాము మంచి స్నేహితుడే. ఎవరి దారి వారిది. అమ్మ నాన్న తర్వాత మనిషి నమ్మేది ఒక స్నేహితుడినే.

“అటుకులు యిచ్చిన పేద కుచేలుడికి, శ్రీకృష్ణుడు ఉన్నాడు. అంటూ అదే పేపర్ చివరి పేజీలో మంచి స్నేహం అనే పేరుతో వచ్చిన కుచేలుడు కథ ఉంది. రాము అక్కడ ఉన్న తన పందుల గుంపులతో ఏడుస్తూ చెప్పుకుంటున్నాడు. అసలు అటుకులు ఇచ్చే వరకు శ్రీకృష్ణుడుకి తెలియదా తన స్నేహితుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడో? అని. అలాంటి కుచేలుడు ఒకడు( అన్వార్ పాషా) న్యూ ఢిల్లో దొంగతనాలు చేస్తున్నాడు. మరొక కుచేలుడు (రాము) చిన్న పల్లెటూరులో పందులు కాస్తున్నాడు. ఈరోజుల్లో ఓడిపోయిన వాళ్ళకి ఎందుకు మంచి స్నేహితులు దొరకడం లేదు. అటువంటి గొప్ప మిత్రులు కనిపించరు. రాము బిగ్గరగా ఏడుస్తూ, కన్నీళ్లు తుడుచుకుంటూ, ఆపుకోలేని బాధతో, ఈరోజు నేను పోతే ఏడ్చే ఒక మనిషిలేడు అంటూ అక్కడ ఉన్న మురికి పందిని హత్తుకొని ఏడుస్తున్నాడు.

పొలం పనులనుంచి ఇళ్ళకి వెళ్తున్నా సుబ్బమ్మ, రంగమ్మ మరి కొంతమంది చూస్తూ, వారిలో ఒకామె, పాపం ఎలా ఉండే పోరగాడు ఎలా ఐయినాడో, మాయదారి గవర్నమెంటు ఉజ్జోగమంటూ దానికోసం పట్నానికి వెళ్లి సదివి ఇలా అయ్యాడు. ఈడి మీద బెంగపెట్టుకున వాడి అమ్మానాయన సచ్చిపోయారు. ఈడు ఏమో ఇట్లా అయిపోయినాడు. పిచ్చిపట్టి మూడు సంవత్సరాలు అయిపోయింది. ఊరికి, కొత్తగా వచ్చిన ఒకామె, అదేంటి అంత తెలివిగా పందులు కాస్తున్నాడుగా? అంటే పక్కన ఉన్న సుబ్బమ్మ హే అలా గట్టిగా అరవకు అవి పందులు కాదు వాటికి కూడా పేర్లు ఉన్నాయి.

ఒక దాని పేరు ఏమో గోషాల్ అంటా,
ఇంకోదాని పేరు అన్వార్ పాషా అంటా,
మరొక్కటి రాము అంటా…, అంటూ అక్కడ ఉన్న వాళ్లు నవ్వుకుంటూ వెళ్లిపోతున్నారు ముప్పై ఏళ్లకి వాడు సంపాదించింది ఆ మురికి పందుల స్నేహం ఒక్కటే మరి.

ఒక మనిషి స్నేహం,
బడి వరకూ,
గుడి వరకూ,
గ్రౌండ్ వరకూ,
వైన్ షాప్ వరకూ,
పండగల సరదాల వరకూ మాత్రమే తప్ప స్నేహితుడి బాధలు తెలుసుకోవటానికి కానీ, మిత్రుడి కష్టం కనిపెట్టడానికి కానీ, ఏ స్నేహం ముందుకు రాదు.

 రచయిత
రామ్ యలగాల 
8019202070

మరికొన్ని ప్రత్యేక కథనాలు…

నా జీవితపు షడ్రుచుల మనోగతం…

RELATED ARTICLES

Most Popular

Recent Comments