Homebreaking updates newsTTD: చెప్పులతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు.. టీటీడీ ఆగ్రహం.. సిబ్బందిపై వేటు

TTD: చెప్పులతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు.. టీటీడీ ఆగ్రహం.. సిబ్బందిపై వేటు

భారత్ సమాచార్.నెట్, తిరుమల: తిరుమల (Tirumala)లో శనివారం చోటుచేసుకున్న భద్రతా వైఫల్యంపై టీటీడీ (TTD) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు సిబ్బందిపై చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన (Negligence in duties) ఏడుగురు సిబ్బందిని టీటీడీ సస్పెండ్ (suspend) చేసింది. టీటీడీ ఈవో శ్యామలరావు (EO Shyamala Rao) ఆదేశాలతో ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఫుట్‌పాత్ హాల్, డౌన్ స్కానింగ్ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు టీటీడీ సిబ్బందిని, ఐదుగురు సెక్యూరిటీ గార్డులను టీటీడీ సస్పెండ్ చేసింది. వీరిలో చక్రపాణి అనే సీనియర్ అసిస్డెంట్, వాసు అనే జూనియర్ అసిస్టెంట్‌తో పాటుగా ఐదుగురు భద్రతా సిబ్బంది ఉన్నారు. మరోవైపు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు ఆరుగురు ఎస్పీఎఫ్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని ఎస్పీఎఫ్‌ డైరక్టర్‌ జనరల్‌కు ప్రతిపాదించింది.

అసలు ఏం జరిగిందంటే.. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తారు. సాధారణ భక్తుల నుంచి వీవీఐపీల వరకూ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే మహారాష్ట్రకు చెందిన కొంతమంది భక్తులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు. అయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ -1 మీదుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. అయితే వీరిలో అభిషేక్, ముకేష్ అనే భక్తులు డిస్పోజబుల్ ఫుట్ వేర్ (పాదరక్షలు) ధరించి ఆలయం మహద్వారం వద్దకు చేరుకున్నారు. దీంతో అక్కడ ముగ్గురు భక్తులను విజిలెన్స్‌ సిబ్బంది అడ్డుకున్నారు. సెక్యూరిటీ సిబ్బంది వారికి చెప్పడంతో వెంటనే పాదరక్షల్ని పక్కన విడిచి శ్రీవారి దర్శనానికి వెళ్లారు.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వీరిని తనిఖీ సిబ్బంది గుర్తించకుండా లోపలికి పంపించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా.. భక్తులు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుగురిని సస్పెండ్ చేసింది. విధుల్లో అలసత్వం వహించారనే కారణంతో ఏడుగురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. మరో ఆరుగురిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాదించింది. కాగా, తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ గుండా ప్రవేశించాల్సి ఉంటుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద భక్తుల వద్ద నిషేధిత వస్తువులు, సెల్‌ ఫోన్స్‌, పాదరక్షలు ఉంటే అక్కడే అడ్డుకుంటారు. అనంతరం ఆ వస్తువులను తీసుకున్న తర్వాత భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments