భారత్ సమాచార్, ‘అక్షర’ ప్రపంచం ;
మనసులో ఎగిసిపడుతున్న జ్వాలలు,
కంట్లో కమ్ముకున్న పొరలు … స్నానపు గది కిటికిలో నుంచి చూస్తుంటే లండన్ బ్రిడ్జి నాకెదురుగా కనిపిస్తోంది, దాన్ని అలానే చూస్తూ కూర్చున్న, కుడి చేతిపక్కన ఉన్న ట్యాప్ తిప్పితే పైన షవర్ నుంచి చిన్న పాటి వర్షపు జల్లు లాంటి నీటి చుక్కలతో నా దేహం తడిసి ముద్దవుతోంది. నా మనసుకు అతి బరువుగా అనిపించే ప్రతి నీటి చుక్క కూడా శరీరానికి కొంచెం హాయినిస్తుంది. ఎంత బాగుందో ఆ నీటి జల్లు నడి నెత్తిపై నుంచి వెనక మెడ, మెడ నుంచి వీపు పట్టుకొని నా శరీరం పైన ఉన్న ప్రతి మచ్చ ను, కనిపించే గాయాలను తాకుతూ నా గతం తాలూకు జ్ఞాపకాలను గుర్తుకు తెప్పిస్తున్నాయి.
అప్పుడు నాకు పది సంవత్సరాలు అనుకుంటా…
“అక్షర, ఆ గులాబీ మొక్కకి నీళ్లు పోయి తల్లి”, అమ్మా…, నేను చదువుతున్న కదా, నాకు ఎందుకు పనులు చెబుతావు, అమ్మ నవ్వుతూ… ఒసేయ్ నీ పేరు అక్షర కదా, నీకు ఇంకా చదువులు ఎందుకే నాకు తెలియదా నా కూతురు గురించి, పాపం గులాబీ మొక్కని చూడు, ఎవరూ ప్రేమించకపోతే ఆ గులాబీ పువ్వు అందంగా నవ్వదు తల్లీ, నా మాట విను దానికి కొన్ని నీళ్లు పోసీ గులాబీకి దాహం తీర్చు. అక్షర, పుస్తకం పక్కకు పెడుతూ…, ఏంటో అమ్మ నీ మాటలే అర్ధంకావు అంటూ నీళ్లు పోస్తుంది. గులాబీ ముళ్లు గీరుకుపోయిన మచ్చ యింకా నాకు గుర్తే ఉంది. ఆ గుర్తు ప్రతిసారి అమ్మని, గులాబీ మొక్కని జ్ఞాపకం చేస్తోంది… నా మనసును తేలిక పరిచే కమ్మని అమ్మ పాట లాగా.
నా చేతివేళ్లతో నెమ్మదిగా పొడవైన జుట్టున్ని పట్టుకొని ముడి వేస్తున్న, పెద్ద ముడిలోనుంచి బొట్టులు, బోట్లుగా నీళ్లు పడుతున్నాయి. మెడ, మెడపైన ఉన్న నల్లటి మచ్చ చేతి స్పర్శతో గతం జ్ఞాపకానికొస్తోంది. మొగుడు అనే పేరుతో ఓ మగాడు నా దేహం పై పెత్తనం చెలాయిస్తూ మెడపై సిగరేట్ తో చేసిన సంతకం అది. ఇక కంట్లో కన్నీటి చుక్కలు దాచుకోవటం నా వల్ల కావటం లేదు. ఒక్కసారిగా వాడు ఎందుకో గుర్తుకొచ్చాడు. వంట గదిలో పులిహోర కోసం చింతపండు గుజ్జు పిసుకుతున్న… ప్రతీ సారి లాగే ఈ సారి కూడా తాగొచ్చాడు. ” ఒసేయ్ ఒక ఆమ్లెట్ వెయ్”. ఆ మాటలు విన్న భయంలో, మెల్లగా…ఈ రోజు ఇంట్లో ఎగ్స్ లేవు అండి. మొగుడు అనే జంతువులా పెద్దగా నవ్వుతూ… కిచెన్ లోకి వచ్చి బల్ల మీద నాకెదురుగా కూర్చున్నాడు. మొహం మీదకి సిగరేట్ పొగ ఊదుతూ… నీ అయ్యా యింకా కట్నం డబ్బులు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తాడో కూడా చెప్పడు, నువ్వు ఏమో ఎగ్స్ లేవు అంటావు, నేను ఏమో తాగుడుకి అప్పులు చేస్తున్నా… అంటూ చేతిలో ఉన్న సిగరేట్ ని నా మెడ మీద పెట్టి మగాడు అనే రాక్షసుడు లా నవ్వుతున్నాడు. ఇదేం కొత్త కాదు కదా, బాగా అలవాటైపోయిన బాదే, చేదు విషంలాంటి గుర్తులు అస్సలు మర్చిపోలేకున్నాను.
ఆ గాయం మీద చిన్న చిన్న నీటి జల్లు, మెడపై నుంచి జారుతూ.. మడత నడుము మలుపు పై నుంచి వెళుతున్నాయి. బాత్రూంలో ఎదురుగా ఉన్న అద్దంలో తెలుస్తోంది. నడుము పైన ఉన్న గుర్తులు యింకా నా మనసును కలవరపరుస్తున్నాయి. అప్పుడప్పుడు వాడు ఇంకా, ఇంకా గుర్తుకొస్తున్నాడు మరి. ఎంతకాదన్న నాపై ప్రేమ చూపించినోడు కదా, గుర్తుకొస్తాడు మరి…
డిగ్రీ ఫైనల్ ఇయర్ లో కాలేజీ లాస్ట్ డే, అందరు హ్యాపీగా ఉన్నారు, జీవిత గమనాలు చూడాలనే కొంచెం భయంతో కూడా ఉన్నారు… హాయ్ అక్షర గారు, నా పేరు మోహన్, నేను మీ జూనియర్ బ్యాచ్, రేపటితో ఇక మీరు కాలేజీకి రారు కాబట్టి, ఈ చివరి రోజు, ఇదే చివరి అవకాశం కాబట్టి మీతో ఎలాగైనా మాట్లాడాలని వచ్చా, నేను మిమ్మల్ని గత రెండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్న. అప్పుడు చెప్పాలంటే ధైర్యం లేదు, ఇప్పుడు కూడా చెప్పకపోతే విషయమే మీకు తెలియదు. అంటూ వాగుతూనేన్నాడు, హలో… ఎవరు నువ్వు, ఏదేదో మాట్లాడుతున్నావ్, ఎవరు అనుకొని మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతోందా, మోహన్ నవ్వుతూ… మీరు ఉంటోంది ఉమెన్స్ హాస్టల్, డోర్ నెంబర్ 69, మీరు ఇంటర్లో ఉన్నప్పుడు అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు ఒంటరిగా ఉంటున్నారు. ఎవరి మీద ఆధారపడకుండా స్కాలర్ షిప్ తో చదువుకుంటున్నారు. రీసెంట్ గానే కొత్త చెప్పులు కూడా కొన్నారు. దానికి కూడా మీ ఫ్రెండ్స్ పార్టీ అడిగితే పానీపూరి ట్రీట్ ఇచ్చారు. అక్షర అలాగే కొంతసేపు ఆశ్చర్యంగా చూస్తోంది. మనసులో… వీడి ప్రేమ చాలా బలంగానే ఉంది అనుకుంటూ, కొంచెం బెట్టు చేస్తూ.. అయితే నా పేరు, అడ్రస్ చెపితే ఇప్పుడు నేను, నిన్ను ప్రేమించాల ఏంటి ? మోహన్ కొంచెం సిగ్గుపడుతూ చూస్తున్నాడు. “మీ చెప్పులు చాలా బాగున్నాయి అండీ”. అక్షర నవ్వుతోంది. ఈ సాయంత్రం నాతో బయటకి వస్తావా ? మోహన్, చాలా హుషారు తెచ్చుకొని, టైం ఎప్పుడు అండీ. ఆ రోజు సాయంత్రం వాడు పట్టుకున్న నడుము, వాడు చూపించిన ప్రేమ ఇప్పటికీ నాకు ఒక చెరిగిపోని జ్ఞాపకమే. పొగరైనా, ఇంకేదైనా కానీ, కారణం లేకుండా నన్ను వదిలేసిపోయాడు. అప్పుడు చెప్పలేని కోపం వచ్చింది కానీ, ఈరోజు అనిపిస్తోంది, ఆలోచిస్తే అప్పుడు వాడికి ఉన్న బాధలేంటో అని, వాడితో ఉన్న కొన్నిరోజులు మాత్రమే జీవితంలో స్వచ్ఛమైన నవ్వుని నవుకున్న. ఎదురుగా ఉన్న అద్దంలో ఆ నవ్వు ఇప్పుడు కొంచెం కనిపిస్తోంది.
షవర్ లో నీటి వేగం మెల్లగా పెరుగుతోంది. ఒడిలో పెద్ద గుర్తు ఇంకా అలాగే మిగిలిపోయింది, వేగంగా జారిపోతున్న నీటి జల్లు చెప్పలేని చోట మిగిలిపోయిన గాయం లాగా మండుతోంది.
దబ్…దబ్…
దబ్… దబ్…
అంటూ డోర్ కొట్టిన చప్పుడు వినిపిస్తోంది. ఇంకా ఎంత సేపు అంటున్నాడు, హా… వస్తున్న నీళ్లు సరిగ్గా రావటం లేదు. కారం, బాధగా కంట్లో పడిపోయింది, పాడు కన్ను ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది. అలాగే నగ్నంగానే ఆమె వెళ్లి మంచం మీద పడుకుంది. వచ్చినోడు వాడికి కావల్సింది చేసుకున్నాడు. అక్కడి నుంచి వెళుతూ 70 పౌండ్ లు పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. పులిసిన ఒళ్ళుతో జుట్టు ముడికడుతూ మళ్లీ వెళ్లి షవర్ కింద కూర్చుంది. ఇప్పడు లండన్ బ్రిడ్జి చాలా మసకగా కనిపిస్తోంది.
ఆమె జీవితం, చేదు తాలూకా విషం తన కూతురుకి తెలీకుండ ఉంచాలనే ఆలోచన ఎప్పూడు అక్షర ని విడిచి పోదు. కాటన్ చీర కట్టుకుంటూ కుచ్చిళ్లు లెక్కపెడుతోంది. విశాలమైన భుజాలకి రవికను తొడుగుతోంది. టేబుల్ మీద ఉన్న పౌండ్స్ ను రవికలో పెట్టుకొని భారంగా ముందుకు నడుస్తోంది. తన జీవితంలో ఉన్న అద్భుతం, ఆనందం కూతురు మాత్రమే. వంటగదిలో పాప ఏదో చేస్తోంది. కూతురు వెనుక నుంచి, తను ఏం వంట చేస్తోందో గమనిస్తోంది. “మామ్ ఇది ఎలా ఉందొ చూడు”, అంటూ కొంచెం తినిపిస్తోంది. రుచి చూసిన అక్షర నవ్వుతూ… ఉప్పు కొంచెం తక్కువ అయింది తల్లీ, అంటూ హాగ్ చేసుకుంది. ఉప్పు వేస్తూ… “అమ్మ మనం లండన్ కి వచ్చిది ఈరోజే అది నాకు బాగా గుర్తుంది, వచ్చేటప్పుడు ఇండియాలో ఉగాది. ఆరోజు నువ్వు చెప్పావు, ఈ ఫెస్టివల్ స్పెషల్ పచ్చడి గొప్ప ఏంటో.
అక్షరకి తెలియకుండానే సంవత్సరం గడిచిపోయింది. ఎదురుగా ఉన్న ప్లేట్ లో ఉగాది పచ్చడిని టేబుల్ మీద కూర్చొని తింటోంది. పులుపు, కారం, చేదు, వగరు, తీపు అన్ని రుచులు చూస్తుంది కానీ ఆమెకి ఉప్పు మాత్రం తెలియటం లేదు. ఆ ఒంట్లో ఉప్పే లేదు. ఇంకా రుచి ఏమి తెలుస్తుంది. అయినా జీవితం మీద ఆశ పోయి ఒక సంవత్సరం అయిపోయింది. ప్రేమికుడు వదిలేశాడు, భర్త అనుమానమనే పెను భూతంతో చంపుతున్నాడు. చుట్టూ ఉన్న మనుషులు వింతగా గమనిస్తున్నారు. బ్రతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్లి మోసపోయిన ఆమె జీవితంలో మిగిలింది తన కూతురు బంధం ఒక్కటే. తన కోసమే ఆమె జీవన పయనం.
చేతిలో ఉన్న ఉగాది పచ్చడి ప్లేట్ లో ఆమె కన్నీరు జారిపడుతున్నాయి. ఇప్పుడు ఆ రుచుల్లోకి ఉప్పు కూడా కలిసిపోయింది. అది చూస్తున్న కూతురు ఆమెను హత్తుకొని కూర్చుంది. బంధమే కదా జీవం, జీవితం. “షడ్రుచులు” ఆమె జీవితంలోనే ఉన్నాయి. కాటన్ చీర కొంగులో ఎండిపోయిన కథలెన్నో...కాలం మారిపోతోంది,
కాలం కంటే వేగంగా మనుషులు మారిపోతున్నారు,
అవసరాల కోసం సాగే బంధాలు దారి మార్చుకుంటున్నాయి.
అయినా కంట్లో నుంచి నీళ్ల రుచి మాత్రం ఎప్పటికి ఉప్పగానే ఉంటుంది. ప్రాణం పోయినంతవరకు కూడా.
ప్రపంచంలో ఉన్నవాళ్లలందరికీ ఉగాధి శుభాకాంక్షలు…
ఇట్లు
అక్షరాల్లో షడ్రుచుల అనుభూతులను కలిగించే మీ రచయిత
రామ్.యలగాల
8019202070
మీకోసం మరికొన్ని ప్రత్యేక కథనాలు…